రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. అనంతరం స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో అయన ముఖాముఖిలో పాల్గొంటారు.
ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు, అక్కడ రాడిసన్ బ్లూ రిసార్ట్స్ లో జరిగే విజన్ విశాఖ సదస్సులో పాల్గొని, అనంతరం పీఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశం కానున్నారు.
విజన్ ఫర్ వైజాగ్ పేరుతో జరిగే పారిశ్రామిక వేత్తల సమావేశంలో 2000 మంది హాజరుకానున్నారని, రానున్న రోజుల్లో వైజాగ్ ను మరింతగా ఎలా అభివృద్ధి చేయనున్నారో జగన్ వివరిస్తారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. 1500 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 7 వ తేదీన అనకాపల్లిలో వైయస్సార్ చేయూత కార్యక్రమంలో పాల్గొని బహిరంగసభలో ప్రసంగిస్తారని అమర్నాథ్ వివరించారు.