ఈనెల 17 న తెలుగుదేశం- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. చిలకలూరిపేటలో జరిగే ఓ భారీ బహిరంగసభలో టిడిపి, జనసేన అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు మేనిఫెస్టో విడుదల చేస్తారని… దాదాపు 10 లక్షల మందితో ఈ సభ నిర్వహిస్తామని, అక్కడే తమ ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ సభ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఓ చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. టిడిపి-జనసేన సమన్వయ కమిటీ సమావేశం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో జరిగింది. అనతరం అచ్చెన్నాయుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు.
టిడిపి-జనసేన అభ్యర్ధుల ప్రకటన తరువాత వైసీపీలో వణుకు మొదలైందని అచ్చెన్న వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రకటించిన సూపర్ సిక్స్ తో పాటు ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందన్నారు. తమ సభకు బస్సులు కావాలని ఆర్టీసీ ఎండికి లేఖ రాశామని, ఒకవేళ ఇవ్వకపోతే భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న వారికి పోలీసులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, అయితే ఎవరూ పోలీస్ స్టేషన్ కు వెళ్ళాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు సూచించారు. బిజెపి నేతల ఆహ్వానం మేరకు చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్తున్నారని అచ్చెన్న ధ్రువీకరించారు.
బిజెపి-తెలుగుదేశం-జనసేన పొత్తు ఉండదంటూ ఇటీవల మీడియాలో కొందరు విషప్రచారం చేశారని, లా చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతామని నాదెండ్ల మనోహర్ అన్నారు. పొత్తులపై రేపు సాయంత్రానికి అన్ని విషయాలూ అందరికీ తెలుస్తాయని చెప్పారు.