కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక జోక్ విరివిగా ప్రచారంలో ఉంటుంది. అన్ని రకాల విమానయాన సంస్థలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్ర రాజధాని నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు పెంచుతాయని చెప్పుకుంటారు. పార్టీ నేతలు ఏ చిన్న కార్యక్రమం చేపట్టాలన్నా…ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేందుకు ఢిల్లీ పయనం అవుతారని… ఆ అయిదేళ్ళు విమానయాన సంస్థల సంపాదనకు డోకా లేదని హాస్యోక్తులు వినిపిస్తుంటాయి. పార్టీ అగ్రనేతలను కలిసేందుకు ఢిల్లీ 10 జనపథ్ ముందు కాంగ్రెస్ నేతలు పడిగాపులు కాయటం కొత్తకాదు.
కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీలో ఉంటుంది కనుక దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. దాంతో సంబంధం లేకపోయినా తెలుగుదేశం, జనసేన పార్టీల పరిస్థితి అలాగే ఉంది. రెండు ప్రాంతీయ పార్టీలే అయినా ఆయా పార్టీల నిర్ణయాలు ఢిల్లీలో జరుగుతాయన్న రీతిలో రెండు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజెపి ప్రాపకం కోసం పడిగాపులు కాస్తున్నారు. గత రెండు రోజులుగా ఇద్దరు నేతలు ఢిల్లీలో మకాం వేయటం… అక్కడ జరుగుతున్న పరిణామాలు ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. టిడిపి, జనసేనల పొత్తు ఖరారు అయినా సీట్ల పంపకాల లెక్క తేలలేదు. బిజెపితో మాట్లాడితేనే స్పష్టత వస్తుందని ఇద్దరు నేతలు ఢిల్లీ వెళ్ళారు.
తెలుగు వారి ఆత్మాభిమాన పరిరక్షణ కోసమే ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు చేపట్టాక దిగజారుడు రాజకీయం పెరిగిపోయిందనే అపవాదు ఉంది. 1996లో పార్టీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతి ఎన్నికలో ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవటం… ఆ తర్వాత మిత్రపక్షంతో చంద్రబాబుకు విభేదాలు సాధారణం. అలా చంద్రబాబు పొత్తు పెట్టుకోని పార్టీ లేదు… విబేదాలు తలెత్తి దూరం కాని మిత్రపక్షం లేదు. అవసరార్థం పొత్తుల ఎత్తులు వేసే చంద్రబాబు వైఖరి దేశ రాజకీయాల్లో అన్ని పార్టీల నేతలకు సుపరిచితమే.
ఇప్పుడు మరింత దిగజారిన చంద్రబాబు బిజెపితో పొత్తు కోసం రెండుసార్లు ఢిల్లీ పర్యటనలు చేపట్టారు. రాష్ట్రంలో ఏ మాత్రం పట్టులేని బిజెపి.. చంద్రబాబును తన చుట్టూ తిప్పుకోవటం విడ్డూరం. దీనిపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవినీతి ఆరోపణల్లో ఇరుకున్న చంద్రబాబు.. కేసుల నుంచి ఉపశమనం కోసమే బిజెపితో పొత్తుకు తహతహ లాడుతున్నారని రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.
ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయటం గమనార్హం. పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మటం అంటే ఇదేనేమో.
ఇక జనసేన తీరు మరీ విడ్డూరం. ఉత్తరాది పెత్తనం పెరిగింది.. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని హైదరాబాద్, అమరావతీల్లో గొంతు చించుకునే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పడిగాపుల్ని ఏ విధంగా సమర్థించుకుంటారు. ఎవరి ప్రతిష్ట పెంచేందుకు ప్రధాని మోడీ, అమిత్ షా లా కటాక్షం కోసం వేచి ఉన్నారు.
పొత్తుల్లో 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్న పవన్ వైఖరితో కాపు, బలిజ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎంపిగా పోటీ చేస్తారని అంటున్నారు. సిఎం అభ్యర్థి అనుకుంటే అది పోయి ఏకంగా ఎంపిగా పోటీ చేయటం విమర్శలకు దారితీస్తోంది. రాజకీయంగా స్పష్టతలేని జనసేన అధినేతతో పయనం ముప్పు అని ఇప్పటికే ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్య దూరం జరిగారు.
కాపుల ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ ను ఉహించుకున్న కాపు సంఘం నేతలకు ఏం జరుగుతోందో అర్థం కావటం లేదు. కాపు నేత ముఖ్యమంత్రిగా ఎదుగుతారని వారు అనుకుంటే… జనసేన అధినేత మాత్రం టిడిపి, బిజెపిల అనుసంధానకర్త కర్తగా మారారని మండిపడుతున్నారు. వారిద్దరూ పంచుకోగా విదిల్చినవి జనసేనకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టిడిపి, జనసేనలు బహిరంగసభల్లో అధికార పార్టీని విమర్శించటం తప్పితే ప్రజల కోసం ఏమి తీసుకురానున్నారో చెప్పటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎట్టకేలకు మూడు పార్టీల మధ్య పొత్తులు కుదిరాయని శనివారం చంద్రబాబు, బిజెపి ప్రకటించాయి. ఢిల్లీలో ఉన్న తమ అధిష్టానం.. బిజెపి సూచనలకు అనుగుణంగా రేపటి నుంచి కూటమి లక్ష్యాలు చెప్పవచ్చని రెండు పార్టీల్లోని నేతలు నిర్వేదంతో గుసగుసలు పెట్టుకుంటున్నారు.
-దేశవేని భాస్కర్