గతంలో ప్రేక్షకులను భయపెట్టడానికి దెయ్యాల సినిమాలు తప్ప మరో మార్గం ఉండేది కాదు. హారర్ థ్రిల్లర్ జోనర్ అనగానే దెయ్యాలు ఆవహించడం .. అవి నానాగందరగోళం చేస్తూ, తెరపై ఇతర పాత్రలను .. ప్రేక్షకులను భయపెట్టడం జరుగుతూ వచ్చింది. ఈ తరహా కథలను ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు గనుక, బడ్జెట్ పరంగా ఒక బంగ్లాకి పరిమితమవుతూ వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో తాంత్రిక శక్తుల నేపథ్యంలో కథలకు డిమాండ్ పెరుగుతూ రావడం గమనించవచ్చు.
అయితే గతంలోనూ క్షుద్ర శక్తుల నేపథ్యంలో వచ్చిన ‘తులసిదళం’ .. ‘కాష్మోరా’ వంటి కథలకు కూడా మంచి ఆదరణ లభించింది. ఆ తరువాత అలాంటి కథలు పెద్దగా రాలేదు. కానీ ఆ మధ్య వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ సినిమా ఇలాంటి కాన్సెప్ట్ నే టచ్ చేసి, ఘనవిజయాన్ని సాధించింది. ఆ తరువాత వచ్చిన సీక్వెల్ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ తరహా కథల్లో కదలిక మొదలైంది. ఆ ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్న మరో సినిమానే ‘తంత్ర’.
అనన్య నాగళ్ల ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించాడు. నరేశ్ బాబు – రవి చైతన్య నిర్మించిన ఈ సినిమా, క్షుద్ర ప్రయోగం నేపథ్యంలో నడుస్తుంది. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ కథపై, అందరిలో ఆసక్తి ఉంది. ట్రైలర్ రిలీజ్ తరువాత ఈ సినిమాపై ఒక్కసారిగా బజ్ పెరిగిపోయింది. రేపు థియేటర్లకు వస్తున్న ఈ సినిమా, ‘మా ఊరి పొలిమేర’ తరహాలో ఆడియన్స్ ను మెప్పిస్తుందేమో చూడాలి.