ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి మంచి క్రేజ్ ఉంది. అందువలన ఈ తరహా కాన్సెప్ట్ లపై మేకర్స్ ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి మరో క్రైమ్ థ్రిల్లర్ సిద్ధమవుతోంది. ఆ క్రైమ్ థ్రిల్లర్ పేరే ‘ఇన్ స్పెక్టర్ రిషి’. నవీన్ చంద్ర కథానాయకుడిగా ఈ సిరీస్ నిర్మితమైంది. నందిని దర్శకత్వంలో ఈ సిరీస్ తమిళంలో రూపొందింది. ఈ నెల 29వ తేదీ నుంచి ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.
నవీన్ చంద్ర ఇప్పుడు ఒక వైపున సినిమాలతో .. మరో వైపున వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నాడు. ఈ రెండింటిలోను ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేశాడు. మంచి హైట్ .. అందుకు తగిన పర్సనాలిటీ ఉండటం వలన, ఆయన ఈ తరహా పాత్రలలో మెప్పిస్తూ వస్తున్నాడు. అందువలన ఈ సిరీస్ లోను ఆయన పోలీస్ ఆఫీసర్ గానే చేశాడు. ఒక ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. హత్యలన్నీ కూడా చాలా పకడ్బందీగా .. డిఫరెంట్ గా జరుగుతూ ఉంటాయి. ఏ హత్యకి సంబంధించి ఎలాంటి ‘క్లూ’ కూడా దొరకదు.
అలాంటి పరిస్థితుల్లో ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు? హంతకులు ఎవరు? ఎందుకోసం హత్యలు చేస్తున్నారు? అనేది సస్పెన్స్. ఇలా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. హత్యలు జరిగే తీరు .. ఆ మర్డర్ మిస్టరీలను ఛేదించే విధానం కొత్తగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. సునైన .. కన్నారవి .. శ్రీకాంత్ దయాళ్ .. కుమార్ వేల్ .. మాలిని జీవరత్నం ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లోను ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.