చంద్రబాబు 2014-19వరకూ రాష్ట్రాన్ని దోచుకున్నారని, కేంద్ర, రాష్ట్ర నిధులను కొలగొట్టారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సీనియర్ జర్నలిస్టు పి. విజయబాబు రచించిన ‘మహా దోపిడీ’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. బాబు దోపిడీకి ఎలా పాల్పడ్డారో, వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో ఈ పుస్తకంలో స్పష్టంగా రాశారని సజ్జల అభినందించారు. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో విధ్వంసం సృష్టించారని….బాబు మోసాలు అర్ధం చేసుకున్న ప్రజలు 2019 ఎన్నికల్లో ఆయన్ను ఘోరంగా ఓడించారని గుర్తు చేశారు.
వైఎస్ షర్మిల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఈ స్క్రిప్ట్ అంతా చంద్రబాబు తయారు చేసిందేనని సజ్జల విమర్శించారు. బాబు, ఆయన్ను నెత్తిన పెట్టుకున్న మీడియా ఏం చెబుతుందో అదే షర్మిల కూడా చెబుతున్నారని, ఆమె మాట తీరును ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని అన్నారు. బిజెపి-కాంగ్రెస్ లు దేశంమంతా కొట్టుకుంటున్నా ఈ రాష్ట్రంలో మాత్రం ఒకే లక్ష్యంతో చంద్రబాబు కోసం పనిచేస్తున్నాయని ఎద్దేవా చేశారు.
ప్రజలకు అవసరమైన మౌలిక అవసరాలు తీర్చడంలో.. జాతి నిర్మాతలు, రాజ్యంగ నిర్మాతలు కోరుకున్న విధంగా సిఎం జగన్ పాలన అందిస్తున్నారని సజ్జల కొనియాడారు. రాజకీయం అంటే దోపిడీ అనే భావనకు బాబు పాలన తార్కాణంగా నిలిచిందని, రాజకీయం అంటే కేవలం అధికారం మాత్రమే బాధ్యతా కాదు అనేది వారి సిద్దాంతం అయితే అధికారం ప్రజల కోసమే అనే సిద్ధంతాన్ని సిఎం జగన్ ఆచరణలో చేసి చూపారని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో మరోసారి రాక్షసుల ముఠా ఏకమవుతోందని… అధికారం కోసం బిజెపి, పవన్ లను బాబు వాడుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ కూడా లోపాయికారీగా సహకరిస్తోందని సజ్జల ధ్వజమెత్తారు.