వైసీపీ మాజీ నేత, నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణమరాజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడు పార్టీల కూటమిలో నర్సాపూర్ సీటు ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీ తరఫున బరిలో ఉంటానంటూ డాంబికాలు పలికిన ఆయనకు శరాఘాతం ఎదురైంది. పొత్తులో భాగంగా బిజెపి ఈ సీటు తీసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత భూపతిరాజు శ్రీనివాసవర్మకు బిజెపి టికెట్ ఇచ్చింది. దీనితో రఘురామకు భంగపాటు తప్పలేదు.
2014 ఎన్నికల సమయంలో తొలుత వైసీపీలో చేరిన రఘురామ కృష్ణంరాజు ఆ తరువాత బిజెపిలో చేరారు. కానీ నర్సాపూర్ టిక్కెట్ ను గోకరాజు గంగారాజుకు బిజెపి కేటాయించింది. 2018లో బిజెపికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ 2019 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు తిరిగి వైసీపీలో చేరి నర్సాపూర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఒక సంవత్సరానికే పార్టీతో విభేదించి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తెలుగుదేశం నేతలు, ఎల్లో మీడియా అండతో వైసీపీపై. సిఎం జగన్ పై నిత్యం విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచేవారు.
కాగా, రఘురామ లోక్ సభ్యత్వం రద్దు చేయించేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసినా బిజెపి అగ్రనేతలతో తనకున్న పలుకుబడి, సాన్నిహిత్యంతో ఆయన దాన్ని విజయవంతంగా అడ్డుకోగలిగారు. రెండేళ్ళ నుంచీ 2024 ఎన్నికల్లో బిజెపి-టిడిపి- జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఘంటాపథంగా చెబుతున్నారు. తనకు టికెట్ రాకుండా పొయే ప్రసక్తే లేదన్న భారంలో ఉంటూ వచ్చారు. కానీ చివరకు బిజెపి మొండిచేయి చూపించింది.
నెలరోజుల క్రితం టిడిపి కరపత్రంగా భావించే ఓ పత్రికలో ఆ పార్టీ నర్సాపురం అభ్యర్ధిగా రఘురామ పేరు ఖరారైనట్లు వార్త కూడా వచ్చింది. కానీ పొత్తులో ఈ సీటు బిజెపి ఖాతాలో పడింది. అయినా సరే ఆ పార్టీ తనపేరు ప్రకటిస్తుందని ధీమాగా ఉన్నారు. కానీ నేడు ప్రకటించిన జాబితాలో మొండిచేయి చూపడం ఆయన్ను నివ్వెరపరిచింది.