ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఒక్కరు సంపాదిస్తే పదిమంది తీరికగా తినేసి తిరిగేవారు. అందరి కోసం అందరం కష్టపడాలనుకునే కుటుంబాలు కూడా లేకపోలేదు. కానీ బాధ్యత మాత్రం ఒక్కరిపైనే క్కువగా పడేది. బాధ్యతలను భుజాన వేసుకుని మోసే ఆ వ్యక్తి తన జీవితంలోని అన్ని రకాల ఆనందాలు .. సంతోషాలు వదులుకుని పని చేసేవాడు. అతను సంపాదింస్తున్నాడు కనుక అతనికి గౌరవాన్ని ఇస్తున్నట్టుగా మిగతా వాళ్లు నటించేవారు.
కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. మనం .. మనం పిల్లలు అంతే. ఉమ్మడి కుటుంబాలు ఊళ్లలోనే కనిపించడం లేదు. ఇక అక్కడి నుంచి పారిపోయి పట్నం వరకూ వస్తాయా? ఇక్కడ ఎవరి కోసం వారు కష్టపడటానికే సమయం లేదు. ఇక అన్నలు .. వదినలు .. వాళ్ల పిల్లల కోసం పరిగెత్తే ఛాన్స్ ఎంతమాత్రం లేదు. కానీ దర్శకుడు పరశురామ్ ఇదే కంటెంట్ ను ఎంచుకుని, ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమాను నిన్న ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. ఈ సినిమాలో హీరోకి బరువు బాధ్యతలు మరీ ఎక్కువైపోయాయి. అందువలన అతనికి హీరోయిన్ ను లవ్ చేయడానికీ .. రొమాన్స్ చేయడానికే సమయం లేదు.
హీరో – హీరోయిన్ మధ్య కోపతాపాలే సరిపోతాయి. అందువలన వాళ్ల వైపు నుంచి ఆడియన్స్ ఆశించే అంశాలు అందలేదు. జగపతి బాబు – వెన్నెల కిశోర్ పాత్రలను ఇంకా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసుకోవచ్చు. అలా చేసి ఉంటే ఆ లోటు భర్తీ అయ్యుండేది. ‘గీత గోవిందం’ సినిమాలో పరశురామ్ ఏ అంశాన్ని వదలకుండా వినోదాన్ని పంచుతూ వెళ్లాడు. ఎంటెర్టైన్ మెంట్ విషయంలో ఎక్కడా గ్యాప్ లేకుండా చూసుకున్నాడు. కానీ ఆ మేజిక్ ఈ సినిమా విషయం మిస్సయ్యింది. అందువల్లనే ఈ సినిమా యావరేజ్ టాక్ తో ముందుకు వెళుతోంది.