చంద్రబాబు వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉండదని, మళ్ళీ జన్మభూమి కమిటీలు తీసుకువస్తారని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి పది వేల రూపాయల వేతనం అందిస్తామంటూ బాబు ఇచ్చిన హామీని, పిట్ట కథలను నమ్మడానికి ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. వాలంటీర్లపై బాబు, పవన్ ఇద్దరూ విషం కక్కారని గుర్తు చేశార. వాలంటీర్లు మహిళలను ట్రాప్ చేసి పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని పవన్ అంటే దాన్ని బాబు సమర్ధించారని… వాలంటీర్లు మూటలు మోయడానికా అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని కొడాలి విమర్శించారు.
అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించి టిడిపి కార్యకర్తలతో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అంతర్గత సమావేశాల్లో బాబు చెబుతున్నారని, వారికి పదివేల రూపాయల వేతనం ఇస్తారని కొడాలి పేర్కొన్నారు. ఒక జిల్లా కల్లెక్టర్, ఎస్పీల వల్లనో ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉండదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారికి నచ్చని అధికారులను మార్పించుకొని గెలిచేందుకే చంద్రబాబు బిజెపితో పొత్తు పెట్టుకున్నారని… లేకపోతే ఇక్కడ కనీసం ఓటు బ్యాంకు కూడా లేని బిజెపితో ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
గెలుపుపై అంత ధీమా ఉంటే ఎర్రటి ఎండలో, 73 ఏళ్ళ వయసులో ఎందుకు సభలు పెడుతున్నారని, గెలుస్తానని తెలిసినా మీటింగ్ లు పెడుతున్నారా అంటూ ప్రశ్నించారు. బూతుల గురించి బాబు మాట్లాడితే అసహ్యంగా ఉంటుందని… సిఎం జగన్ ను సైకో, లేపెస్తా అని, దమ్ముంటే రండి అని పిచ్చివాగుడు మాట్లాడుతూ తనను అనే హక్కు బాబుకు ఎక్కడిదని నిలదీశారు.