సమాజంలోని అన్ని కులాల మధ్య సామరస్య భావాన్ని పెంపొందించాలని సామాజిక సమరసతా వేదిక జాతీయ సంయోజక్ శ్యాంప్రసాద్ జీ పిలుపు ఇచ్చారు. మంగళవారం సామాజిక సమరసత వేదిక జగిత్యాల జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక గీతా గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా శ్యామ్ ప్రసాద్ జీ పాల్గొన్నారు. కరోనా సమయంలో సేవలు అందించిన సమరసత సభ్యులను ఆయన అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను తరిమి కొట్టాలని సూచించారు.
సమాజంలో అన్ని కులాల వారు ఐకమత్యంతో ఉండి, అందరం ఒకటే అనే భావనను కల్పించాలన్నారు. దేశంలో అనేక కులాలు, ఆరాధనా పద్ధతులు ఉన్నప్పటికీ మనమంతా భారతమాత సంతానం అనే భావన పెంపొందించినప్పుడే సమాజంలో ఐక్యత నెలకొంటుందని శ్యామ్ ప్రసాద్ జీ వివరించారు. దురదృష్టవశాత్తు మన రాజకీయ నాయకులు ప్రజలను కులాలు , మతాలు, భాషల పేర్లతో విడదీస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితి దేశానికి మంచిది కాదన్నారు. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలను విడనాడి ప్రజలంతా ఒకటే అనే భావన పెంపొందించేందుకు సమరసత కార్యకర్తలు కృషి చేయాలని, సమాజాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఉద్దేశించిన సామూహిక ఉత్సవాలను నిర్వహించాలని శ్యామ్ ప్రసాద్ జీ సూచించారు.
రాబోయే రక్షాబంధన్ కార్యక్రమం అన్ని గ్రామాల్లో నిర్వహించాలని, మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉందని, అందుకు ప్రతి కార్యకర్త ముందుండి పనిచేయాలని శ్యామ్ జీ సూచించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక బాద్యులు కనికరం లచ్చన్న, చిట్ల గంగాధర్, మంతె రాజేందర్, గడ్డం మహిపాల్ రెడ్డి, ఎల్లాల రాజారెడ్డి, కొలిచాల రవీందర్, వైద్య బాలమురళి కృష్ణ,తోపారపు రవి, ఆలూరు రాంరెడ్డి, ఊరేడి శ్రీనివాస్, గాజుల మల్లేశం, పతంజలి శ్రీనివాస్, బాపురపు గంగన్న, చింత భీమయ్య, కాందేశ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.