Sunday, November 24, 2024
HomeTrending Newsఅయితే మోడీ.. త‌ప్పితే ఈడీ- కెసిఆర్ విమర్శ

అయితే మోడీ.. త‌ప్పితే ఈడీ- కెసిఆర్ విమర్శ

బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తన ప్రసంగాలలో పదును పెంచారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని దుమ్మెత్తి పోశారు. కేంద్రంలో బిజెపి అధికారాన్ని అడ్డం పెట్టుకొని విపక్షాలను వేధిస్తోందని తనదైన శైలిలో మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపిలపై శనివారం చేవెళ్ళ సభలో కెసిఆర్ మాటల మంత్రానికి ప్రజల నుంచి స్పందన బాగా వచ్చింది.

కెసిఆర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు

ప్రజలు అధికారం ఇస్తే పదేండ్లు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నామని చెప్పారు. ఇవాళ అవన్నీ తన కండ్ల ముందే పోతుంటే.. రైతులు గోస పడుతుంటే.. పంటలు కొనకపోతుంటే.. బాధగలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బతికి ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తా తప్ప నోరు మూసుకుని కూర్చోనని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌ పార్టీల రంజిత్‌ రెడ్డికి ఏం తక్కువ చేసినం అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఎంపీ టికెట్‌ ఇవ్వలేదా? గౌరవం ఇవ్వలేదా? ఆయనెందుకు పార్టీ మారిండు అన్నారు. ఆయన ఏమైనా పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటుంటే అటు తిరుగుతడా? అని సెటైర్‌ వేశారు.

కాంగ్రెస్‌ నాయకులు 420 వాగ్ధానాలు చేశారన్నారు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు.. స్కూటీలు ఎక్కడికి పోయాయి. స్కూటీలు లేవు కానీ రాష్ట్రంలో లూటీలు మాత్రం జోరుగా చేస్తున్నారని మండిపడ్డారు. భయంకరమైన లూటీ మొదలుపెట్టిండ్రని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే రియల్‌ ఎస్టేట్‌ ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న బ్రోకర్లు ఎవరు? జోకర్లు ఎవరు? అని ప్రశ్నించారు.

కల్యాణలక్ష్మి కింద కేసీఆర్‌ లక్ష రూపాలే ఇస్తున్నడు. మా ప్రభుత్వం వస్తే తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పారు. యాడికి పోయింది తులం బంగారం. తులం బంగారం కొందామంటే మార్కెట్‌లో దొరుకతలేదా? ఈ ప్రభుత్వానికని మండిపడ్డారు.

బీజేపీపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ ప‌దేండ్ల‌లో ప్ర‌జ‌ల్లో భావోద్వేగాలు పెంచ‌డం త‌ప్ప ఒక్క మంచి ప‌ని కూడా చేయ‌లేదు. అయితే మోడీ.. త‌ప్పితే ఈడీ.. ఇదేనా బీజేపీ రాజ‌కీయం..? అని కేసీఆర్ నిల‌దీశారు.

ఇప్పుడు ప్రజల చేతిలోకి ఒక అంకుశం కావాలని.. ఒక హంటర్‌ కావాలని కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వం మెడలు వంచి పనిచేయించే అంకుశం అవసరం ఇప్పుడు ఉందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ పనులు చేయించాలంటే తెలంగాణలోని అన్ని ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్‌ గెలవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

నిన్న మొన్నటి వరకు ప్రజలే తప్పుడు హామీలకు ఆకర్షితులు అయ్యారని… బీఆర్ఎస్ పాలన మిస్ అయ్యారని మాట్లాడిన కెసిఆర్ తీరులో కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత కెసిఆర్ ప్రజల మనసులు ఎరిగి మాట్లాడినట్టు ఉంది. కెసిఆర్ జోరు ఇలాగే సాగితే తిరిగి గులాబీ గుభాలించేందుకు ఎంతో సమయం పట్టదు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్