Sunday, November 24, 2024
HomeTrending Newsఇజ్రాయల్ పై దాడి వెనుక ఇరాన్ కుయుక్తులు

ఇజ్రాయల్ పై దాడి వెనుక ఇరాన్ కుయుక్తులు

హమాస్ ఉగ్రవాదులకు మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్న ఇరాన్… అన్నంత పనీ చేసింది. ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ పేరుతో 200కుపైగా కిల్లర్‌ డ్రోన్లు, బాలిస్టిక్‌ మిస్సైళ్లు, క్రూయిజ్‌ క్షిపణులతో ఇజ్రాయల్ మీద విరుచుకుపడింది. ఇరాక్‌ గగనతలం నుంచి టెల్ అవిన్ వైపుగా మిస్సైళ్ళు దూసుకెళ్లాయి. కొన్నింటిని మధ్యప్రాచ్యంలోని అమెరికా బలగాలు మధ్యలోనే కూల్చివేయగా మరికొన్నింటిని సిరియా, జోర్డాన్‌ గగనతలం మీద ఇజ్రాయెల్‌ నేలమట్టం చేస్తోంది.

దేశ ప్రజలను అప్రమత్తం చేసిన యూదు పాలకులు  జెరూసలెం,టెల్ అవిన్ తదితర ముఖ్య నగరాల్లో అలెర్ట్ ప్రకటించారు. హమాస్ కు కొమ్ము కాసే వారు ఎంతటి వారైనా… ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయల్ ఆర్మీ తేల్చి చెప్పింది.

సిరియాలోని తమ కాన్సులేట్‌ భవనం ఘటన తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్‌ చెప్పినట్లే ఇజ్రాయెల్‌పై దాడికి దిగింది.  ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, లెబనాన్‌, ఇరాక్‌ తమ గగనతలాలను మూసివేశాయి. సిరియా, జోర్డాన్‌ దేశాలు తమ వైమానిక దళాలను అప్రమత్తం చేశాయి. ఇజ్రాయెల్‌పై దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ ఖండించారు. ప్రపంచం మరో యుద్ధాన్ని భరించే స్థితిలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలన్నారు. ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.

ఇజ్రాయెల్‌, అమెరికాలు తమపై ప్రతి దాడులకు దిగితే ఈసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. ముస్లిం సమాజంలో పెద్దన్న పాత్ర పోషించేందుకు ఇరాన్, టర్కీ పోటీ పడుతున్నాయి. ఒకడుగు ముందుకు వేసిన ఇరాన్ హమాస్ ఉగ్రవాదులను ఇజ్రాయల్ మీద దాడికి ఉసిగొల్పింది. మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ముస్లిం సమాజంలో నాయకత్వ స్థాయికి ఎదగటం.. దేశ ప్రజలను మత చట్రంలోకి తీసుకొచ్చేందుకు ఇరాన్ పాలకులు చేస్తున్న యత్నమని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల అంచనా.

2022 సెప్టెంబర్ లో మహస అమిని మృతితో అల్లర్లు రాజుకున్నాయి. హిజాబ్ అంశంలో ఇరాన్లో మానవ హక్కుల కార్యకర్తల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్నారు. దీంతో అనేక సంస్థలు ఎన్నికల బహిష్కరణకు పిలుపు ఇచ్చాయి. ఇరాన్ లో రెండు రౌండ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మొదటి దశ మార్చి ఒకటిన జరగగా.. రెండో రౌండ్ మే 10న ఉన్నాయి. మొదటి దశలో కేవలం 41 శాతం పోలింగ్ నమోదైంది.

1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదు కావటం ఇప్పుడే. రెండో దశ ఎన్నికల్లో గెలిచిన సబ్యులు ఇరాన్ సుప్రీం లీడర్ ను ఎన్నుకునే అవాకాశం ఉంటుంది. దీంతో ప్రజల్లో పట్టు సాధించేందుకు పాలక ఇస్లామిక్ రిపబ్లిక్ పార్టీ అధికారం చేజిక్కించుకునేందుకు కుయుక్తులకు పాల్పడుతోంది.

స్వదేశంలో పట్టు కోల్పోతున్న ఇరాన్ పాలకులు… తాజా దాడులతో దేశ ప్రజల ఆలోచనలను అభ్యుదయ భావాల నుంచి మతం వైపు మళ్ళించే యత్నం జరుగుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్