శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును నిందితుడిగా నిర్ధారిస్తూ విశాఖ కోర్టు తీర్పు వెల్లడించింది. ఆయనకు 18 నెలల జైలు శిక్ష తో పాటు రెండున్నర లక్షల రూపాయల జరిమానా విధించింది. మరో సెక్షన్ కింద ఇంకో ఆరు నెలల పాటు శిక్ష వేసింది. ఇప్పటి కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్ 29న ఈ ఘటన జరిగింది. ఓ వివాదం విషయంలో ఐదుగురు దళితులను హింసించి వారిలో ఇద్దరికి శిరోముండనం చేయించారు. అప్పటి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలోనే ఈ ఘటన జరిగినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1997 జనవరి 1న పోలీసులు కేసు నమోదు చేశారు. తోట త్రిమూర్తులు తోపాటు మరో ఐదుగురు ఆయన కుటుంబ సభ్యులు, మరో ముగ్గురు సహాయకులు కలిపి మొత్తం 9 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
1998లో కేసును కొట్టివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బాధితుల తరఫున బొజ్జా తారకం ఏపీ హైకోర్టులో మాండమస్ రిట్ పిటిషన్ వేసి 2000లో ఈ కేసును రీ ఓపెన్ చేయించారు. విశాఖలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు కేసు విచారణ చేపట్టింది. 2012 నుంచి 2019 వరకూ కేసు విచారణ 146 సార్లు వాయిదా పడింది. 28 ఏళ్ళుగా ఈ కేసుపై వివిధ న్యాయస్థానాల్లో విచారణ జరిగింది. త్రిమూర్తులు 87 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు.
ఈ ఘటన జరిగిన సమయంలో త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 1994 ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి ఇండిపెండెంట్ పోటీ చేసి విజయం సాధించిన ఆయన మరుసటి ఏడు తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999, 2012 (ఉప ఎన్నిక), 2014 సంవత్సరాల్లో టిడిపి తరఫునే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ప్రస్తుత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరిన తోట త్రిమూర్తులు ఈ ఎన్నికల్లో మండపేట నుంచి వైసీపీ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. తోట త్రిమూర్తులుకు రాజకీయంగా ప్రత్యర్ఘిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ శిరోముండనం కేసు విషయంలో బాధితుల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలూ వైసీపీలోనే ఉండడం గమనార్హం.
నేడు తీర్పు వెలువరిస్తున్న సమయంలో ఆయన కోర్టు హాలులోనే ఉన్నారు. రెండేళ్ళ లోపు శిఖ్స్ పడిన దృష్ట్యా ఎన్నికల్లో అయన పోటీకి ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. తీర్పు వెలువరించిన వెంటనే త్రిమూర్తులుతో పాటు ఇతర నిందితులు రూ. 42 వేల రూపాయల పూచీకత్తు సమర్పించి బెయిల్ కు దరఖాస్తు చేశారు. దీనిపై జడ్జి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ బెయిల్ తిరస్కరిస్తే నిందితులను జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.