ఉత్తరాంధ్ర ప్రగతిలో విశాఖపట్నం కీలక పాత్ర పోషిస్తుందని, అలాంటి నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేసిందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఏనాడూ పట్టించుకోలేదన్నారు. తాము విశాఖ నగరంలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేశామని, ఇక్కడే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహించి దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకొని…6 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సంకల్పించామని చెప్పారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించామని, సిఎం జగన్ కూడా ఇక్కడే నివాసం ఉండాలని నిర్ణయించారని… అయితే కొన్ని దుష్టశక్తులు వేసిన కోర్టు కేసుల కారణంగా ఆలస్యం అయ్యిందని వెల్లడించారు. గతంలో టిడిపి నేతలు దోపిడీ కోసమే అమరావతిని రాజధానిగా ప్రకటించారని విమర్శించారు. విశాఖలో బొత్స మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత విశాఖలోనే సిఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని, కానీ కూటమి నేతలు దీనిపై స్పష్టత ఇవ్వాలని, బొత్స డిమాండ్ చేశారు. ప్లాంట్ ను ప్రైవేటీకరించబోమంటూ బిజెపి నేతలతో చెప్పించాలన్నారు. బిజెపి జాతీయ నేతలు రాష్ట్రంలో కూటమి తరఫున ప్రచారానికి రావడం అనుమానమేనని వ్యాఖ్యానించారు. రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ పై సమాధానం చెప్పాల్సి ఉంటుందని అందుకే వారు రాకుండా తప్పించుకుంటారని బొత్స అభిప్రాయపడ్డారు. మోసం, దగా, కుట్ర అనేవి చంద్రబాబు పేటెంట్ అని మండిపడ్డారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయని, మూలపేట పోర్టు, ఫిషింగ్ హార్బర్ ల నిర్మాణం, విశాఖలో డేటా సెంటర్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మొదలు పెట్టామని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా సీపీఎస్ స్థానంలో జీపీఎస్ ను తీసుకు వచ్చామన్నారు.