లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సరికొత్త పంథా ఎంచుకున్నారని తెలిసింది. ఎండిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు రోడ్డు షోల్లో పాల్గొనాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 11 గంటల వరకు పొలం బాట.. సాయంత్రం నుండి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో 2-3 చోట్ల రోడ్డు షోలు నిర్వహించనున్నట్లు సమాచారం. సిద్దిపేట, వరంగల్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్రణాలికలు రూపొందిస్తున్నారు.
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు(గురువారం) పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 17 ఎంపీ నియోజకవర్గాల అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం ఒక్కో అభ్యర్థికి రూ. 95 లక్షల విలువ చేసే చెక్కులను కూడా కేసీఆర్ అందించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై గులాబీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కెసిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలిసింది. రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారని అన్నారు.
“ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారని.. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ను బీజేపీ వాళ్లు బతకనిస్తారా?” అని ప్రశ్నించాడు.
కాంగ్రెస్‌కు అధికారం వచ్చింది కదా అని బీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్తే ఇక్కడ అంతా బీజేపీ కథ నడుస్తుందని నాతో ఆ నాయకుడు వాపోయాడు.
ఇప్పటికిప్పుడు 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ అని నన్ను సంప్రదించాడు, కానీ ఇప్పుడే వద్దని నేనే చెప్పా” అని బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ నేతలతో అన్నట్టు సమాచారం.
లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటి పూర్వ వైభవం తీసుకురావాలని… పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కెసిఆర్ చొరవ తీసుకుంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల హామీలను గుర్తు చేసి…పదునైన విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రోడ్డు షోలు నిర్వహించేలా ప్రణాలికలు రూపొందిస్తున్నారు.
-దేశవేని భాస్కర్