Friday, November 22, 2024
HomeTrending Newsమొదటి దశకు స్పందించని ఓటరు

మొదటి దశకు స్పందించని ఓటరు

లోక్‌సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్‌ ఉహించని రీతిలో చాలా తక్కువగా నమోదైంది. 102 లోక్ సభ స్థానాలకు జరిగిన పోలింగ్ లో సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం మంది ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 77.57 శాతం, అత్యల్పంగా బీహార్లో 46.32 శాతం పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ సమయం ముగిసేటప్పటికి క్యూలైన్‌లలో ఉన్నవారు ఓట్లు వేస్తున్నారు. దాంతో మరో రెండు లేదా మూడు శాతం పోలింగ్‌ పెరిగే అవకాశం ఉంది.

సాయంత్రం 5 గంటల వరకు అందిన లెక్కల ప్రకారం.. తమిళనాడులో 62.08 శాతం, రాజస్థాన్‌లో మరీ 50.27 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 57.54 శాతం, మధ్యప్రదేశ్‌లో 63.25 శాతం, మహారాష్ట్రలో 54.85 శాతం పోలింగ్‌ నమోదైంది. అదేవిధంగా అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 67.5 శాతం, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో 64.7 శాతం ఓట్లు పోలయ్యాయి.

నాగాలాండ్‌లోని ఒకే లోక్‌సభ స్థానానికి శుక్రవారం ఒకే దశలో పోలింగ్‌ జరిగింది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్‌ నమోదైంది. ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ (ఎఫ్‌ఎన్‌టీ)ని ఏర్పాటు చేయాలని తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్‌పీవో) 2010 నుంచి డిమాండ్‌ చేస్తున్నది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీనిపై స్పందించకపోవడంపై ఏడు గిరిజన సంఘాలతో కూడిన ఈ సంస్థ లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఎన్నికల ప్రచారం కోసం ఏ రాజకీయ పార్టీని అనుమతించబోమని పేర్కొంది. అలాగే 20 అసెంబ్లీ సీట్లున్న ఆరు జిల్లాల్లో పబ్లిక్ ఎమర్జెన్సీ ప్రకటించింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్