చిరంజీవితో పాటు ఎంత మంది కూటమికి మద్దతు ఇచ్చినా నష్టం లేదని, ఆయన ఆ విధంగా చెప్పడం తమకు మరీ మంచిదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చిరంజీవే కాదు మొత్తం శక్తులన్నీ ఏకమయ్యాయని, దానికి ఒకరో, ఇద్దరో అదనంగా తోడైతే వారికి ఒరిగేదేమి లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజకీయ తెరపై ఒక స్పష్టత వచ్చిందని…. జగన్ ఒక్కరే ఒకవైపు ఉన్నారని, తోడేళ్ళు, హైనాలు, గుంటనక్కలు, ముళ్ల పందులు అన్నీమరోవైపు ఉన్నాయని అభివర్ణించారు. అధికారం కోసమే కూటమి అని వారు అనుకుంటే… అధికారం అంటే ప్రజలకు సేవఅందించే బాధ్యత అనుకునే జగన్ మరోవైపు ఉన్నారని స్పష్టం చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో పార్టీ స్దితిగతులను మంత్రి జోగి రమేష్, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డిలతో సమీక్షించిన అనంతరం మీడియాతో సజ్జల మాట్లాడారు. కూటమికి ఓ అజెండా లేదని, నానాజాతి సమితి అంతా కలిసి అధికారం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఎద్దేవా చేశారు.
పవన్ కల్యాణ్ ఓ పార్టీ అధినేత అనేది పక్కన పెడితే ఆయన జనసేన పార్టీని ఎందుకు పెట్టాడో తెలియదని, నాయకుడుగా ఆయన ఆలోచనల్లో ఎప్పుడూ స్పష్టత లేదని సజ్జల విమర్శించారు. బహుశా చంద్రబాబు కోసమే ఆయన పుట్టినట్లు…పెరిగినట్లుగా… అంకితమైనట్లుగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలతో బాబుతో పాటు పవన్ కల్యాణ్ రాజకీయ అంకం కూడా ముగుస్తుందని జోస్యం చెప్పారు. బాబు ఏ మాటలు చెప్పమంటే అదే పవన్ చెబుతాడని, ఆయన వద్దంటే ఆగిపోతాడని మెచ్యూర్డ్ రాజకీయనేత కాదని ఆయనకు అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నియోజకవర్గాలలో ప్రచారం జరుగుతున్న తీరు, పార్టీ శ్రేణుల పనితీరుపై సమీక్షలు చేస్తున్నామని, పార్టీ పరిస్దితి చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారని, వైయస్సార్ సిపి విజయం ఖాయం అయిందని విశ్వాసం వెలిబుచ్చారు. జగన్ ఈనెల 25 వతేదీన నామినేషన్ దాఖలు చేస్తారని వెల్లడించారు.