అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులతో మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. నిఘా విభాగం చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా వెంటనే బాధ్యతలనుంచి తప్పుకోవాలని, తమ తర్వాత స్థానాల్లో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించి రిలీవ్ కావాలని ఆదేశించింది. అంతేగాకుండా వీరిద్దరినీ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ సాధారణ ఎన్నికలు ముగిసే వరకూ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధుల్లోకి తీసుకోవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది.
వీరిద్దరి స్థానాల్లో నియమించేందుకు గాను ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున అధికారులను సూచిస్తూ బుధవారం మధ్యాహ్నం లోగా పేర్లు తమకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కెఎస్ జవహర్ రెడ్డికి సూచించింది.
ఏప్రిల్ 2న గుంటూరు రేంజ్ ఐజీతో సహా ఆరుగురు ఐపీఎస్ అధికారులు, ముగ్గురు ఐఏఎస్ (జిల్లా కలెక్టర్లు) సహా తొమ్మిది మందిపై కొరడా ఝలిపించిన ఎన్నికల సంఘం 20 రోజుల వ్యవధిలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై చర్యలకు ఉపక్రమించడం చర్చనీయాంశమైంది.