Friday, November 22, 2024
HomeTrending Newsరిజర్వేషన్లపై కాంగ్రెస్ బిజెపి రాజకీయం

రిజర్వేషన్లపై కాంగ్రెస్ బిజెపి రాజకీయం

సార్వత్రిక ఎన్నికలు కొత్త రూపు దాలుస్తున్నాయి. రెండు దశల పోలింగ్ ముగియగా మరో వారం రోజుల్లో మూడో దశ జరగనుంది. ఈ తరుణంలో ఓటర్లను ప్రభావితం చేసే కొత్త అంశం తెరమీదకు వచ్చింది. రిజర్వేషన్ల అంశం దుమారం లేపుతోంది. బిజెపి మూడో సారి గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. కాంగ్రెస్ లో అన్ని స్థాయిల నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల సిద్ధిపేట ఎన్నికల సభలో పేర్కొన్నారు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి వాటిని SC, BC, ST వర్గాలకు పంచుతామని ప్రకటించారు.

దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగింది. బిజెపి రిజర్వేషన్లకు వ్యతిరేకమని… అమిత్ షా మాట్లాడినట్టుగా వైరల్ అయింది. ఇదే అంశాన్ని ప్రస్తావించిన సిఎం రేవంత్ రెడ్డి OBCల ప్రయోజనాలపై బిజెపి సర్జికల్ స్ట్రైక్ చేస్తోందని.. బిజెపి అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు ముప్పు అని ఆరోపించారు.

దీనిపై కేంద్ర హోం శాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ సిఎం, కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేశారు. దీనిపై స్పందించిన సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో బిజెపి ఇలాంటి పనులు చేయటం సాధారణమని కొట్టిపారేశారు. పైగా రిజర్వేషన్లపై బిజెపి కుట్ర చేస్తోందని సరూర్ నగర్ కార్నర్ మీటింగ్ లో మళ్ళీ ఆరోపించారు.

ఈ అంశాన్ని ఇప్పుడు బిజెపి మరింత పదును చేసి ఎన్నికల ప్రచారస్త్రంగా ఉపయోగించుకోవడానికి సిద్దమైంది. తాజాగా యుపి సిఎం యోగి ఆదిత్యానాథ్ ఇదే అంశాన్ని ఎత్తుకున్నారు. ఏ రూపంలోనైనా మ‌త ప్రాతిప‌దిక‌న రిజర్వేష‌న్ల‌ను కాషాయ పార్టీ వ్య‌తిరేకిస్తుంద‌ని యూపీ సీఎం స్ప‌ష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు బీజేపీ మ‌ద్ద‌తుగా నిలుస్తుంద‌ని చెప్పారు. అంబేద్క‌ర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచిన చ‌రిత్ర కాంగ్రెస్ పార్టీదేన‌ని మండిప‌డ్డారు.

ఓబీసీల కోటా 27 శాతంలో కోత విధించిన నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం అందులో 6 శాతం బుజ్జ‌గింపు రాజ‌కీయాల్లో భాగంగా ఓ వ‌ర్గానికి క‌ట్ట‌బెట్టింద‌ని విమ‌ర్శించారు. ఎస్సీ, ఎస్టీల‌కు ఉద్దేశించిన రిజ‌ర్వేష‌న్‌లో స‌చార్ క‌మిటీ సాకుతో కొన్ని ముస్లిం కులాల‌కు స‌ద‌రు కోటాలో వాటా కల్పిస్తూ వారిని ఆ కేట‌గిరీలో చేర్చింద‌ని ఆరోపించారు. ప్రధాని మోడీ ఈ అంశాన్ని నేరుగా ప్రస్తావించకపోయినా కాంగ్రెస్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.

రెండు పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కుతోంది. రాజకీయ రంగు పులుముకున్న రిజర్వేషన్ల అంశం ఏ పార్టీకి మేలు చేస్తుందో వేచి చూడాలి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్