Friday, November 22, 2024
HomeTrending Newsమోడీ, రేవంత్ మిలాఖాత్ - కెసిఆర్

మోడీ, రేవంత్ మిలాఖాత్ – కెసిఆర్

ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్‌ మిలాఖత్‌ కాకపోతే వెంటనే ఆర్‌ ట్యాక్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఇన్‌కం ట్యాక్స్‌ను విచారణ కోసం రంగంలోకి దించాలని బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిమాండ్‌ చేశారు. బస్‌యాత్ర మంగళవారం కొత్తగూడెం చేరుకున్నది. ఈ సందర్భంగా కార్నర్‌ మీటింగ్‌లో కేసీఆర్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు .. నరేంద్ర మోడీ మన తెలంగాణకు వచ్చిండు. ఆందోల్‌లో ఒక సభలో మాట్లాడిండు. రేవంత్‌రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నడని మాట్లాడుతున్నడు.

అది నిజమే అయితే.. మీ ఇద్దరు మిలాఖత్‌ కాకపోతే ముఖ్యమంత్రిపై వెంటనే విచారణకు ఆదేశించాలి. వెంటనే ఈడీని దించు. ఐటీని దించు. ఎక్కడెక్కడ దొంగతనం జరుగుతుందో పట్టుకో. అదిచేతకాదు నరేంద్ర మోదీ. మీదికి నాటకాలు ఆడతారు కానీ.. ఖచ్చితంగా ఇవాళ ఇద్దరూ ఒక్కటే. ఎవరికి ఓటు వేసినా గోదావరిలో పారేసినట్లే తప్పా.. మన రాష్ట్రానికి వచ్చిన లాభం ఏమీ లేదు’ అంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నరేంద్ర మోదీ అంత దరిద్రమైన పాలన మళ్లీ మనం చూడం. అంత దుర్మార్గమైన పాలన. మతాలకు పంచాయితీ పెట్టి.. మన ఉద్వేగం రేపి ఓట్లు దొబ్బుకునేడే తప్ప ఏ మంచి పని జరుగలేదు. అమృత్‌ కాల్‌ అన్నడు వచ్చిందా? ఏదైనా మంచి పని జరిగిందా? అంటూ ప్రశ్నించారు.

మోదీ ఇవాళ ఏమంటున్నడు ? నేను గోదావరి నదిని ఎత్తుకుపోయి తమిళనాడు, కర్నాటకకు ఇస్తా అంటున్నడు. తెలంగాణకు ఉన్న ఒకే ఒక ఆధారం గోదావరి. మనకు ఉన్న ఒకే ఒక ఆధారం గోదావరి. ఆ గోదావరి నది కూడా పోతే మన బతుకులు ఏం కావాలన్నారు. మొత్తం తెలంగాణకు గోదావరినే లేకుండా చేస్తానంటే.. ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదు ? దాని వెనకలా ఉన్న మతలబు ఏంటీ ఆలోచన చేయాలన్నారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అడ్డగోలు వాగ్ధానాలతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను మోసం చేసిందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోపించారు. ఆనాడు గిరిజన బిడ్డలకు పరిపాలన చేరువకావాలని కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు రేవంత్‌రెడ్డి జిల్లా తీసేస్తమంటున్నడని అన్నారు. కొత్తగూడెం జిల్లా ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సురుకుపెట్టాలని పిలుపునిచ్చారు.

రోడ్డు షో అనంతరం సింగరేణి గెస్టు హౌజ్ లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో ఎన్నికల్లో గెలుపు కార్యాచరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కెసిఆర్ ప్రచారానికి రావటంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. ముఖ్యంగా ఖమ్మం లోక్ సభ పరిధిలో బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు మెరుగు అయ్యాయని ఆ పార్టీ నేతలు భరోసాతో ఉన్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్