జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించి ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి, యువతకు ఉపాధి కల్పించాలన్నదే తమ కూటమి బలమైన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని, రైతులను ప్రభావితం చేసే మూడు కీలక పదవులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి కుటుంబానికి కట్టబెట్టిన జగన్ కు క్లాస్ వార్ గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. వ్యవసాయం చేసే రైతులు నష్టాల్లో ఉన్నారని, గంజాయి పండించే వైకాపా నేతలు లాభాల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గంజాయి గూండాలను ఉక్కుపాదంతో నలిపేస్తామని హెచ్చరించారు. డా. కోనసీమ అంబేద్కర్ జిల్లా మండపేటలో జరిగిన జనసేన వారాహి విజయభేరి సభలో పవన్ ప్రసంగించారు.
పోలీస్, రెవిన్యూ, పౌరసరఫరాల వ్యవస్థలను బలోపేతం చేయాలని బాబు, తాను కలిసి నిర్ణయించామన్నారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని, వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై అందిస్తామని, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని, దళారుల దోపిడీ అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఒకప్పుడు ఏపీ అన్నపూర్ణగా ఉండేదని, ఉభయ గోదావరి జిల్లాల్లో వరి సాగు బాగా ఉండేదని కానీ ఇప్పుడు 12 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిందని… కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారని, రైతులంతా వైసిపికి పొలిటికల్ హాలిడే ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కనీసం ప్రతిపక్షంగా కూడా ఉండే అర్హత ఆ పార్టీకి లేదని, ఆ అవకాశం కూడా లేనంతగా ఓడించాలని కోరారు.
జగన్ కులాలను వాడుకుని ఎదుగుతున్నాడని, మనం ఆ కులాలు దాటి వెళ్ళకపోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు. పట్టాదారు పాసుబుక్ లపై ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి కానీ జగన్ ఫొటో ఎందుకని ప్రశ్నించారు. ప్రధానిగా మోదీ ఉన్నందున పాస్ పోర్ట్ పై ఆయన ఫొటో పెట్టలేదుగా అంటూ వ్యాఖ్యానించారు.