ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వచ్చే ఖజానాకు ముఖ్యమంత్రి ఓ ధర్మకర్త మాత్రమేనని, ఆయన సొంత డబ్బులు సంక్షేమం ద్వారా ఇవ్వడంలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జనం సొమ్ము దోచుకోవడం కాదని, వారికి పంచి పెట్టాలని సూచించారు. అటవీ శాఖ మంత్రి ఒక్కసారైనా కొల్లేరు ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారని పెద్దిరెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఆయనకు ఎర్రచందనంపైన ఉన్న శ్రద్ధ కొల్లేరుపై లేకుండా పోయిందని విమర్శించారు. కృష్ణా జిల్లా కైకలూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పవన్ పాల్గొన్నారు. బిజెపి అసెంబ్లీ అభ్యర్ధి కామినేని శ్రీనివాస్, ఏలూరు లోక్ సభ టిడిపి అభ్యర్ధి పుట్టా మహేష్ యాదవ్ లను గెలిపించాలని కోరారు.
భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై మొదటిసారి గళమెత్తింది తానేనని, తాము అధికారంలోకి రాగానే ముఠా కూలీలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేశామని ప్రకటించారు. కలిదిండి మండలంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, ముదినేపల్లి మండలంలో గోడౌన్లు, కేంద్రంతో మాట్లాడి ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయిస్తామని పవన్ హామీ ఇచ్చారు.
ఐదేళ్లుగా యువతను నిర్వీర్యం చేశారని, గంజాయికి బానిసలు చేశారని పవన్ విమర్శించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, వారి నిర్ణయం మీదే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. వైసీపీకి ఓటేస్తే ఆస్తులు గాల్లో పెట్టిన దీపం అవుతాయని ప్రజలను హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వస్తే అడ్డగోలుగా దోచేస్తారని గతంలోనే తాను చెప్పినా ఎవరూ వినలేదని… ఈసారి మళ్ళీ గెలిపిస్తే రాష్ట్ర అతోగతి పాలవుతుందని పేర్కొన్నారు. ప్రజలంతా భయపడకుండా బతకాలని కోరుకుంటున్నానన్నారు. ప్రజల సమస్యల పరిష్కార బాధ్యతను తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు.