సూర్య కుమార్ యాదవ్ చెలరేగి ఆడడంతో నేడు జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఘనవిజయం సాధించింది.
వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకంది. హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్, కమ్మిన్స్ మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. హెడ్ 30 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 48 పరుగులు చేయగా… కమ్మిన్స్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి నాతౌట్ నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 173 పరుగులు చేయగలిగింది.
ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా, హార్దిక్ పాండ్యా చెరో మూడు; అన్షుల్ కంబోజ్, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు.
లక్ష్య సాధనలో ముంబై అయితే ముంబై 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇషాన్ కిషన్ 9; రోహిత్ శర్మ 4 పరుగులు మాత్రమే చేయగా, నమన్ ధీర్ డకౌట్ అయ్యాడు. ఈ 31 పరుగుల్లో 17 పరుగులు ఎక్స్ ట్రా ల రూపంలోనే లభించడం గమనార్హం. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్- తిలక్ వర్మలు నాలుగో వికెట్ కు 143 పరుగుల అజేయ భాగస్వామ్యంతో… మరో 16 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు అద్భుతమైన విజయం అందించారు. సూర్య 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 102; తిలక్ 32 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులు సాధించారు.
సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.