తెలుగు చలన చిత్ర నటుడు, మెగాస్టార్ చిరంజీవి భారతదేశపు రెండో అత్యున్నత పౌరపురస్కారం ‘పద్మవిభూషణ్’ పురస్కారం స్వీకరించారు. రాష్ట్రపతి భవన్ లో నేడు జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆయనకు ఈ పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
కళా రంగానికి చేసిన సేవలకు గాను ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చిరంజీవితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, నటి వైజయంతి మాల, పద్మా సుబ్రహ్మణ్యం, బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం) లకు ఈ రెండో అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేశారు.
వెంకయ్యనాయుడు, పద్మా సుబ్రహ్మణ్యం, పాఠక్ తరఫున ఆయన భార్య ఈ అవార్డును ఏప్రిల్ 23 జరిగిన వేడుకలో స్వీకరించగా నేడు చిరంజీవి, వైజయంతిమాల ఈ గౌరవం అందుకున్నారు.
ఈ వేడుకకు చిరంజీవి భార్య సురేఖ, తనయుడు హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.