Monday, November 25, 2024
HomeTrending Newsసుక్మా ఎదురుకాల్పులపై అనుమానాలు

సుక్మా ఎదురుకాల్పులపై అనుమానాలు

దేశమంతా నాలుగో దశ ఎన్నికల పోలింగ్ లో ఉంటే తుపాకుల మోతలతో ఛత్తీస్‌గఢ్‌ దద్దరిల్లుతోంది. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఛత్తీస్ ఘడ్ అడవులు రక్తమోడుతున్నాయి. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. సెమ్రా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిసింది. సుక్మా జిల్లా బోటెతంగో ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమచారంతో భద్రతాదళాలు అక్కడికి వెళ్లి, స్థానిక పోలీసులతో కలిసి కూంబింగ్‌ నిర్వహించాయి.

ఈ సందర్భంగా మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో 12 మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా ప్రాంతంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఎదురుకాల్పులపై సమీప గ్రామాల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎదురుకాల్పులు నిజం కాదని.. ఆ పేరుతో అమాయక గిరిజనులను చంపేస్తున్నారని ఆదివాసి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల ఒత్తిడితో CRPF బలగాలతో కలిసి స్థానిక పోలీసులు అమాయక అడవి బిడ్డలను పొట్టన పెట్టుకున్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఎదురుకాల్పులు జరుగుతున్న సమయంలో సమీప గ్రామాల ప్రజలు పోలీసులను చుట్టుముట్టారని తెలిసింది. బీజాపూర్ పోలీసు హెడ్ క్వార్టర్స్ వద్ద పెద్ద సంఖ్యలో చేరుకున్న ఆదివాసీలు ఆందోళన చేయటంతో ఓ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆదివాసీలకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు హక్కుల సంఘాలకు ఫిర్యాదులు చేస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్