లోక్ సభ ఎన్నికల పోలింగ్ తెలంగాణలో ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో 47.88 శాతం పోలింగ్ నమోదైంది. ఆరు గంటల లోపు క్యూ లైనులో ఉన్నవారికి ఓటింగ్ అవకాశం ఇచ్చారు. దీంతో మరో రెండు శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల అధికారులు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి దంపతులు, వారి కుమార్తె నిమిషా రెడ్డి కోడంగల్ లో ఓటు వేశారు. మాజీ సిఎం కెసిఆర్ దంపతులు సిద్ధిపేట నియోజకవర్గం చింతమడకలో ఓటు వేశారు. కరీంనగర్ బిజెపి అభ్యర్థి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లో ఓటు వేశారు. వివిధ ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఆదిలాబాద్ -69.81 శాతం, భువనగిరి -62.34 శాతం, చేవెళ్ల -53.15 శాతం, హైదరాబాద్-39.17 శాతం, కరీంనగర్-67.67 శాతం, ఖమ్మం-70.76 శాతం, మహబూబాబాద్-68.60 శాతం, మహబూబ్‌నగర్-68.40 శాతం, మల్కాజిగిరి-46.27 శాతం, మెదక్-71.33 శాతం, నాగర్ కర్నూల్ -66.53 శాతం, నల్గొండ-70.36 శాతం, నిజామాబాద్-67.96 శాతం, పెద్దపల్లి-63.86 శాతం, సికింద్రాబాద్ -42.48 శాతం, వరంగల్-64.08 శాతం, జహీరాబాద్-71.91 శాతం నమోదైంది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మహబూబాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని సమస్యాత్మకమైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది.
మరోవైపు హైదరాబాద్ లో మజ్లీస్, బిజెపి అభ్యర్థులు ఎదురు పడటంతో కొద్దిసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. బిజెపికి వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేయటంతో పోలీసులు జోక్యం చేసుకొని యువకుల్ని పంపించారు. మాధవీలత ఓటర్ ఐడీలు, స్లిప్‌లను పరిశీలిస్తూ ఓటర్లను తనిఖీ చేస్తున్న వీడియో వెలుగుచూసింది. ఓటర్ల ముఖాలను చూసి, వారిని గుర్తించిన తర్వాత ఓటింగ్‌కు అనుమతించాలని ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ వ్యవహారంలో ఆమెపై కేసు నమోదైంది.
-దేశవేని భాస్కర్