ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో ఈ రోజు(మంగళవారం) నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. వారణాసి ఎంపిగా రెండు సార్లు గెలిచిన మోడీ ఇక్కడి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ దాఖలు చేయడానికి ముందు, ప్రధాని దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగా నదికి ప్రార్థనలు చేశారు. నగరంలోని కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బిజెపి ముఖ్య నేతలు, మిత్రపక్షాల నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎల్జేపీ-రామ్ విలాస్ అధినేత చిరాగ్ పాశ్వాన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, రాష్ట్రీయ లోక్ మోర్చా చీఫ్ ఉపేంద్ర కుష్వాహా తదితరులు పాల్గొన్నారు.
2014లో 3 లక్షల 37 వేల ఓట్లతో ప్రధాని మోడీ గెలిచారు. 2019లో అంతకు మించిన మెజారిటీ వచ్చింది. 4 లక్షల 80 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈసారి మెజారిటీపై అంతకు మించిన అంచనాలున్నాయి.