పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
మొన్న జరిగిన పోలింగ్ లో ఓటు వేసిన అనంతరం బాపట్ల జిల్లా చిన్నాగంజం నుంచి 40 మంది ప్రయాణికులు అరవింద్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ ట్రావెల్ బస్సులో హైదరాబాదుకు బయల్దేరారు. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం – పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్.. బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌కు మంటలు బస్సుకూ మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులతో పాటు డ్రైవర్, క్లీనర్ తో మొత్తం 42 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. టిప్పర్ డ్రైవర్, బస్ డ్రైవర్ తో పాటు మరో బస్సులో ప్రయాణిస్తున్న మరో నలుగురు ప్రయాణికులు సహా మొత్తం ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు.
చిన గంజాంలో బయలుదేరినప్పటి నుంచి బస్సును డ్రైవర్ కమ్ ఓనర్ అంజి ఓవర్ స్పీడ్ తో నడుపుతూ వచ్చారని ప్రమాదం నుంచి బైటపడిన ప్రయాణికులు చెప్పారు. పలువురు వారించినా డ్రైవర్ వినలేదని, కేవలం అతని నిర్లక్ష్యం వల్లే ఆరు నిండు ప్రాణాలు బుగ్గిపాలయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే క్లీన పారిపోయారని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఏడుగురికి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మృతుల కుటుంబాలకు సిఎం సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్ధించారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని ప్రకటించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.