Friday, November 22, 2024
HomeTrending Newsకిర్గిస్తాన్ లో అల్లర్లు.. భారత విద్యార్థులు క్షేమం

కిర్గిస్తాన్ లో అల్లర్లు.. భారత విద్యార్థులు క్షేమం

మధ్య ఆసియా దేశం కిర్గిస్థాన్‌ లో అల్లర్లు చెలరేగాయి. అక్కడ విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. కిర్గిస్థాన్‌ – ఈజిప్ట్‌ విద్యార్థుల మధ్య మే 13వ తేదీన జరిగిన ఘర్షణ దాడులకు దారి తీసింది. రెండు వర్గాల మధ్య జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలు శుక్రవారం వైరల్‌ కావడం హింసకు దారి తీసింది.

కిర్గిస్తాన్ లో అరబ్ దేశానికి చెందిన యువతీ యువకులు కలిసి ఉంటున్నారు. అమ్మాయిలను కిర్గిస్తాన్ యువకులు ర్యాగింగ్ చేయడంతో అరబ్ యువకులు అడ్డుకున్నారు. దీంతో అదే రోజు సాయంత్రం యువకులు మూకుమ్మడిగా అరబ్ విద్యార్థులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

దీంతో భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ విద్యార్థులు నివసించే బిష్కెక్‌లోని కొన్ని వైద్య విశ్వవిద్యాలయాల హాస్టళ్లపై దాడి జరిగిందని సమాచారం. దాడిలో పాకిస్థాన్‌కు చెందిన పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు జాగ్రత్తలు సూచించింది. విద్యార్థులు ఎవరూ బయటకు రావొద్దని సూచించింది. ఈ మేరకు కిర్గిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టింది. ‘మన విద్యార్థుల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికి, విద్యార్థులు ఎవరూ బయటకు రావొద్దు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలి’ అని పేర్కొంది. ఈ మేరకు 24 గంటలపాటూ అందుబాటులో ఉండే ఫోన్ నంబర్‌ (0555710041)ను షేర్ చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. కిర్గిస్థాన్‌లో దాదాపు 14,500 మంది భారతీయ విద్యార్థులు నివసిస్తున్నారు.

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైంకర్ సైతం ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. విద్యార్థులు బయటకు రావద్దని, ఏదైనా అవసరమైతే ఎంబసీని సంప్రదించాలని సూచించారు.

దాడులపై పాకిస్థాన్‌ ప్రభుత్వం స్పందించింది. దాడిలో పాక్‌కు చెందిన విద్యార్థుల మరణాలు, గాయాలపై నివేదికలు వచ్చినప్పటికీ తమకు ఇప్పటి వరకూ అధికారిక సమాచారం అందలేదని తెలిపింది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకూ విద్యార్థులు ఎవరూ బయటకు రావొద్దని పాక్‌ రాయబార కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం ఆ దేశంలో దాదాపు 10,000 మంది పాకిస్థానీ విద్యార్థులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

కిర్గిస్తాన్  ముస్లిం దేశమే అయినా అరబ్బు దేశాల తరహాలో సంప్రదాయాలు, కట్టుబాట్లు కటినంగా ఉండవు. గతంలో రష్యా పాలనలో ఉన్న ఈ దేశం 1991లో సోవియెట్ యూనియన్ పతనం తర్వాత స్వతంత్ర దేశంగా అవతరించింది. సున్ని ముస్లింలు అధికంగా ఉండే కిర్గిజ్ రాజకీయాల్లో క్రమంగా ఇస్లాం ప్రాధాన్యత పెరగటం సెక్యులర్ వాదులను కలవరపెడుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్