Tuesday, November 26, 2024
HomeTrending Newsకాంగ్రెస్, బిజెపిలకు ఎన్నికల సంఘం నోటీసులు

కాంగ్రెస్, బిజెపిలకు ఎన్నికల సంఘం నోటీసులు

లోక్ సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ దాటాక కాంగ్రెస్, బిజెపి నేతలు, ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు చేస్తున్న ప్రచార శైలి ప్రజలను తికమకపెడుతోంది. దేశంలో ఏదో జరగబోతోంది అన్నట్టుగా రెండు పార్టీలు.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలు చేసే ప్రసంగాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ప్రచారాల్లో కుల, మత ప్రస్తావనలు తీసుకురావటంపై మండిపడింది. ఈ మేరకు అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీలకు బుధవారం నోటీసులు ఇచ్చింది.

అగ్ర నేతలు, క్యాంపెయినర్లు చేసే ప్రసంగాలు గాడి తప్పుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా స్టార్‌ క్యాంపెయినర్‌లు ప్రచార శైలి మార్చుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు రెండు పార్టీల జాతీయ అధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారాల్లో మతపరమైన అంశాలకు దూరంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొంది.

సమాజంలో విభజనకు దారితీసే ప్రసంగాలను వెంటనే ఆపాలని బీజేపీకి సూచించింది. అదేవిధంగా రాజ్యాంగం రద్దవుతుందనే తప్పుడు అభిప్రాయం కలిగించే ప్రకటనలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీని ఎన్నికల సంఘం ఆదేశించింది. నేతలు, సోషల్ మీడియా విభాగాలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉహజనిత ప్రకటనలు ప్రచారం చేస్తే తగిన చర్యలు తీసుకోవలసి ఉంటుందని ఎలక్షన్ కమిషన్ హెచ్చరించింది.

లోక్ సభ ఎన్నికలు మరో రెండు దశలు మాత్రమే మిగిలి ఉండగా రెండు ప్రధాన పార్టీలు వాటి మిత్రపక్షాలు ప్రజల్లో అయోమయం సృష్టించే విధంగా ప్రచారం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మైనారిటీలు, మెజారిటీ ప్రజల్లో ఆందోళన ప్రారంభం అయిందని… ఫలానా పార్టీ వస్తే కొత్త చట్టాలు వస్తాయని అపోహలు వైరల్ అవుతున్నాయి.

రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. రాజకీయ పార్టీలు హద్దులు దాటకుండా తగిన చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత ఉందని పౌర వేదికలు డిమాండ్ చేస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్