లోక్ సభ ఎన్నికల్లో చివరి అంకం ఏడో దశ పోలింగ్ ప్రారంభం అయింది. ఎనిమిది రాష్ట్రాలలోని 57 నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉత్తరప్రదేశ్(13), బిహార్(8), పశ్చిమ బెంగాల్(9), హిమాచల్ ప్రదేశ్(4), జార్ఖండ్(3), ఒడిశా(6), పంజాబ్(13), చండీగడ్(1) ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
చివరి దశ ఎన్నికల్లో ఓటింగ్ జరుగుతున్న ప్రధాన స్థానాల్లో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి సీటు కూడా ఉంది. దీంతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ స్థానం నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, బీహార్‌లోని పాటలీపుత్ర స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి పోటీ చేస్తున్నారు.
పంజాబ్ లోని 13 సీట్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. యూపీలోని 13 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గాలు మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, ఖుషినగర్, డియోరియా, బన్స్‌గావ్, ఘోసి, సలేంపూర్, బల్లియా, ఘాజీపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, రాబర్ట్స్‌గంజ్. బన్స్‌గావ్, రాబర్ట్స్‌గంజ్ రిజర్వ్డ్ సీట్లు.
హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తున్నది. లోక్‌సభ ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్ 1న రాష్ట్రంలోని నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడంతో ఆ స్థానాలకు కూడా ఈ విడతలోనే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఆరుగురు బీజేపీ టికెట్‌పై పోటీచేస్తున్నారు. బీఎస్పీ బరిలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొన్నది.
2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలనూ(సిమ్లా, కంగ్రా, హమీర్‌పూర్, మండి) బీజేపీ కైవసం చేసుకున్నది. హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నియోజకవర్గం నుంచి బాలివుడ్ నటి కంగనా రౌనత్ బరిలో ఉన్నారు. మాజీ సిఎం వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్యతో కంగనా తలపడుతున్నారు. చండీగడ్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారి పోటీ చేస్తున్నారు. 2019లో సిని నటుడు అనుపం ఖేర్ భార్య కిరణ్ ఖేర్ ప్రాతినిధ్యం వహించగా ఈసారి బిజెపి టికెట్ సంజయ్ టాండన్ కు ఇచ్చారు. అయితే ఈసారి కమలం పార్టీకి గెలుపు అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏడో దశలో బెంగాల్లో మొత్తం నగర ప్రాంతంలోని నియోజకవర్గాలలోనే పోలింగ్ జరుగుతోంది. తృణముల్ కాంగ్రెస్ దిగ్గజ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలు కావటం గమనార్హం. సందేశ్ ఖలీ అమానవీయ ఘటన జరిగిన బసీర్ హాట్ స్థానానికి ఈ దశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి.
ఉత్తర కలకత్తా, దక్షిణ కోల్‌కతా, డైమండ్ హార్బర్, జాదవ్‌పూర్, డమ్ డమ్, బరాసత్, బషీర్‌హాట్, జోయ్‌నగర్, మధురాపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో జాదవ్ పూర్ నియోజకవర్గంలో సిపిఎం సీనియర్ నేత సోమనాథ్ చటర్జీని ఓడించి దీది పార్లమెంటులో అడుగుపెట్టారు. దక్షిణ కలకత్తా నుంచి దీది ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు.
కలకత్తా ఉత్తర్ నుంచి తృణముల్ సీనియర్ నేత సుదీప్ బందోపాద్యాయ బరిలో ఉన్నారు. వరుసాగా మూడుసార్లు గెలిచిన సుదీప్ దా నాలుగోసారి గెలిచేందుకు ఉవ్విల్లురుతున్నారు. డం డం స్థానం నుంచి సౌగత రాయ్ బరిలో ఉన్నారు. బరాసత్ నుంచి తృణముల్ పార్టీ అగ్గిబరాటాగా పేరొందిన కకాలి ఘోష్ దస్తిదర్ నాలుగోసారి గెలిచేందుకు పోటీ చేస్తున్నారు.
-దేశవేని భాస్కర్