లోక్ సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ తరుణంలో మరో వివాదం మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు(గురువారం) సాయంత్రం నుంచి కన్యాకుమారిలో 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. ఏడవ దశ లోక్‌సభ పోలింగ్ జూన్ ఒకటో తేదీన ఉన్నందున.. ప్రధాని మోడీ చేపట్టబోయే ధ్యానంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
కాంగ్రెస్, డీఎంకే పార్టీలు.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. మోడీ ధ్యానం చేయడం అంటే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే అవుతుందని, అందుకే ఆ ధ్యానం ప్రసారాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కన్యాకుమారి జిల్లాకు చెందిన డీఎంకే యూనిట్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
పంజాబ్ హోషియార్పూర్ లో ఎన్నికల ప్రచారంలో చివరి ప్రసంగం చేసిన ప్రధాని మోడీ.. ప్రతిష్టాత్మక వివేకానంద రాక్ మెమోరియల్‌లో ధ్యానం చేయనున్నారు. కన్యాకుమారిలో ప్రధాని మోడీ ధ్యానంలో పాల్గొనే అంశాన్ని అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల్లో లైవ్ ఇవ్వనున్నట్లు బీజేపీ పార్టీ తన ఎక్స్ అకౌంట్‌లో తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కేదార్‌నాథ్‌లో ప్రధాని మోడీ ధ్యానం చేశారు.
ఈ రోజు సాయంత్రం నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఆయన ధ్యాన ముద్రలో ఉంటారు. వివేకానంద రాక్‌లో ఉన్న ధ్యాన మండపంలో ధ్యానం చేయనున్నారు. వివేకానంద రాక్‌లో ధ్యానం చేసిన వివేకానందుడు.. భారత మాత గొప్పతనంపై అద్భుత విజన్ చేశారు. కన్యాకుమారిలోని శ్రీ భగవతీ అమ్మన్ ఆలయంలో పూజలు చేయనున్నారు. వివేకానంద రాక్ పక్కనే ఉన్న తిరువల్లవురు విగ్రహాన్ని ఆయన సందర్శిస్తారు. తమిళ కవి తిరువల్లవురుకు చెందిన 133 ఫీట్ల ఎత్తైన విగ్రహం అక్కడ ఉన్నది.
ప్రధాని మోడీ రాక సందర్భంగా.. కన్యాకుమారిలో భద్రత కట్టుదిట్టం చేశారు. సుమారు రెండు వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ఇండియన్ కోస్టు గార్డు, ఇండియన్ నేవీ కూడా నిఘా పెట్టింది. తిరునల్వేలి రేంజ్ డీఐజీ పర్యవేక్షణలో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ రాక సందర్భంగా కన్యాకుమారి బీచ్ లో గురువారం నుంచి శనివారం వరకు పర్యాటకులకు అనుమతి లేదు.
-దేశవేని భాస్కర్