రాష్టంలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో నమోదైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఎన్నికల సంఘం ఇచ్చిన మెమోను సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ ను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది. హోదా, సీల్ లేకపోయినా ఆ ఓటును పరిగణనలోకి తీసుకోవాలంటూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన మెమో విషయంలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ విజయ్ మరియు జస్టిస్ కిరణ్మయిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి వివాదాలు కేవలం ఎలక్షన్ పిటిషన్ ద్వారా మాత్రమే పరిష్కరించాలని చట్టం చెబుతోందని వ్యాఖ్యానించింది. పిటిషనర్ లకు చట్ట రీత్యా ఉన్న ఇతర అవకాశాలు పొందటానికి అవకాశం ఇచ్చింది.
వైకాపా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, వీరారెడ్డి వాదనలు వినిపించగా…. కేసులో ఇంప్లీడ్ అయిన ఎమ్మెల్యే, తెలుగుదేశం నేత వెలగపూడి రామకృష్ణ తరపున పదిరి రవితేజ, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు…. ఎలక్షన్ కమిషన్ తరపున నియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ లు తమ వాదనలు వినిపించారు.