Friday, November 22, 2024
HomeTrending Newsఇండియా కూటమి - ఎన్డీయే కూటమి పోటా పోటీ

ఇండియా కూటమి – ఎన్డీయే కూటమి పోటా పోటీ

లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. వార్ వన్ సైడే అనుకుంటే.. పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పైకి కూటములు ఉన్నా.. అందులోని పార్టీలు హ్యాండిస్తే మాత్రం లెక్కలన్నీ తారుమారయ్యే అవకాశం ఉంది. అందుకే.. ఈసారి కేంద్రంలో అధికారం చేపట్టేది ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత లెక్కల ప్రకారం.. బీజేపీ పూర్తిస్థాయి మెజిక్‌ఫిగర్ సీట్లను సాధించలేదు. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ఆ పార్టీకి మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి. ప్రస్తుతం ఆ పార్టీ 244 స్థానాల్లో ముందంజలో ఉంది. మేజిక్ ఫిగర్ 272 కాగా.. ఇంకా 33 సీట్లు కావాల్సి ఉంటుంది. ఎన్డీయే మిత్రపక్షాలన్నీ కలిసి 297 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. వీరిలో ఎక్కువ సీట్లు ఉన్న నితీష్ కుమార్ గానీ, మహారాష్ట్రలో షిండే వర్గం గానీ.. జేడీఎస్, టిడిపి లాంటి ప్రధాన పార్టీలతో సీన్ మారిపోయే అవకాశం ఉంది.

ఈసారి ఎన్డీఏ కూటమికి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. దాంతో ప్రభుత్వం స్థిరంగా కొనసాగాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతు కీలకంగా మారింది. ముఖ్యంగా నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమిలో కీలకపాత్ర పోషించనున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ 16 స్థానాల్లో, జేడీయూ 14 స్థానాల్లో విజయం సాధించాయి.

అదేవిధంగా కూటమిలోని ఏక్‌నాథ్‌ షిండే వర్గం శివసేన పార్టీకి ఆరు స్థానాలు, చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌జన శక్తి పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించాయి. దాంతో ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు ఎన్‌డీఏకు కీలకంగా మారాయి.

బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించగా కాంగ్రెస్ పార్టీ 98 సీట్లలో ఆధిక్యంలో ఉంది. మూడో పెద్ద పార్టీగా 34 సమాజ్ వాది పార్టీ, తృణముల్ కాంగ్రెస్ 29 స్థానాలతో నాలుగో స్థానంలో, డిఎంకె -22, టిడిపి-21 స్థానాల్లో గెలుపు దిశగా సాగుతున్నాయి.

రాష్ట్రాల వారిగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు విశ్లేషిస్తే ఉత్తరాదిలో బిజెపికి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్ లో గణనీయంగా స్థానాలు కోల్పోయింది. బీహార్లో ఆర్జెడి చతికిల పడటం బిజెపికి కలిసి వచ్చింది. లేదంటే కేంద్రంలో ఎన్డీయే కూటమి కష్టాల్లో పడేది.

హర్యానా, పంజాబ్ లో బిజెపికి రైతులు గట్టిగా జవాబు ఇచ్చారు. ఢిల్లీ ప్రజలు బిజెపిని ఆదరించారు. అగ్నివీర్ వ్యవహారం,  రాజ్ పుత్ ల ఆగ్రహానికి రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బిజెపి కొంత దెబ్బ తగిలింది.

దక్షిణాదిలో తమిళనాడు ఈసారి కూడా బిజెపి బోణి కొట్టలేక పోయింది. కేరళలో మొదరిసారిగా త్రిస్సూర్ నియోజకవర్గంలో సిని నటుడు సురేష్ గోపి బిజెపికి విజయం సాధించి పెట్టారు. కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న వ్యవహారం కొంత దెబ్బతీసిన బిజెపి నిలదొక్కుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పట్టు బిగించింది.

జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తరువాత ఆ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో ఇండియా కూటమి హవా నడుస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లోని 5 స్థానాలకు గాను 4 స్థానాల్లో భారత కూటమి ఆధిక్యంలో ఉంది. ఎన్డీయే కూటమి ఒక చోట లీడ్‌లో ఉంది. జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తన ఓటమిని అంగీకరించారు. గెలిచిన స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్ రషీద్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్‌ కంచుకోటను బద్దలు కొట్టిన స్మృతి ఇరానీ.. ఈ ఎన్నికల్లో  పరాజయం చెందారు. గాంధీ కుటుంబ విధేయుడు అయిన కిశోరీ లాల్ శర్మ విజయం సాధించారు. అమేథీకి మూడు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఎంపీ రాహుల్ గాంధీ.. 2019లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి రాహుల్ విజయం సాధించారు.

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ చన్నీ జలంధర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆయన బీజేపీ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకూపై 1,75,993 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఎన్డీయే కూటమి సమావేశం రేపు ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మిత్ర పక్షాలన్నింటిని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎన్డీయే చైర్మన్ పదవి చంద్రబాబు, నితీష్ కుమార్ లలో ఒకరికి కట్టబెట్ట వచ్చని ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్