Friday, November 22, 2024
HomeTrending Newsఎన్డీయే కూటమిలో తెరవెనుక మంత్రాంగం

ఎన్డీయే కూటమిలో తెరవెనుక మంత్రాంగం

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి. అయితే తెరవెనుక పెద్ద మంత్రాంగమే సాగుతోందని ఢిల్లీ వర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను ఎన్డీయే గెలుచుకున్నప్పటికీ, బీజేపీకి సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సీట్లు రాకపోవడమే అందుకు కారణం.

ఇండియా కూటమి ఏర్పాటులో కీలక భూమిక పోషించిన జేడీయూ నేత, బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ఆ తర్వాత ఎన్డీయేలో చేరారు. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలకు ముందు రోజు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ చేసిన ప్రకటన ఎన్డీయేలో ప్రకంపనలు రేపుతున్నది ‘తన పార్టీని కాపాడుకునేందుకు నితీశ్‌కుమార్‌ ఏమైనా చేస్తారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవచ్చు’ అని చేసిన వ్యాఖ్యలు, నితీశ్‌కుమార్‌ ఇండియా కూటమిలోకి తిరిగి వచ్చే అవకాశం లేకపోలేదని చెప్పకనే చెప్పాయి. బీహార్‌లో నితీశ్‌కుమార్‌ ప్రభుత్వానికి గతంలో కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చింది.

బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ను తిరిగి ఇండియా కూటమిలోకి తీసుకురావడానికి కాంగ్రెస్‌ నేతలు పావులు కదుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నితీశ్‌కుమార్‌ ఇండియా కూటమిలోకి వస్తే ఆయనకు ఉప ప్రధాని పోస్టును ఆఫర్‌ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. నితీశ్‌తో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ మంతనాలు సాగిస్తున్నారని సమాచారం.

నితీశ్‌కుమార్‌తోపాటు, ఏపీలో 16 సీట్లు గెలిచిన టీడీపీ అధినేత చంద్రబాబును ఇండియా కూటమిలోకి రప్పించడానికి మమత ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఇప్పటికే చంద్రబాబుతో మంతనాలు  జరిపారని ఉహాగానాలు ఉన్నాయి. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా చంద్రబాబుతో కర్జాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సంప్రదింపులు జరుపుతున్నారని కూడా చెప్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ మద్దతు కీలకంగా మారడంతో బీజేపీ అప్రమత్తమైంది. చంద్రబాబు తమ కూటమిలోనే ఉన్నా ఆయన ‘చే’జారిపోకుండా ప్రధాని మోడీ, అమిత్‌షా స్వయంగా ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు ఎన్డీయే కన్వీనర్‌ పోస్టు ఆఫర్‌ చేసినట్టు తెలిసింది.

తాజా సమాచారం ప్రకారం నితీష్, చంద్రబాబులకు ఉప ప్రధాని పదవులు ఆఫర్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరు నేతలు సిఎం పదవి వదులుకుంటే వారి స్థానాన్ని రాష్ట్రంలో భర్తీ చేసే నేతలు ఇప్పటికిప్పుడు లేకపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు బిజెపి ఆఫర్ అంగీకరించే అవకాశం లేదు.

కూటమి నుంచి బయటకు వస్తే నితీష్ కుమార్ రాజకీయంగా దారుణమైన స్థితికి చేరుకోవచ్చు. అదే క్రమంలో చంద్రబాబు కాంగ్రెస్ తో జత కడితే రాష్ట్రంలో రాబోయే కాలంలో రాజకీయంగా తెలుగుదేశం దెబ్బతినే అవకాశం ఉంది. ఇద్దరు నేతలు సిఎం పదవి సుస్థిరం చేసుకునేందుకే మొగ్గు చూపుతున్నారని సమాచారం.

ఇద్దరు నేతలకు తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా తీసుకోవాలని కోరిక ఉంది. ఇందుకోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావచ్చు. రెండు పెద్ద రాష్ట్రాలే కావటంతో ప్రత్యేక హోదా సాధ్యం అయ్యే పని కాదు. దీంతో అభివృద్ధి కార్యక్రమాలకు విరివిగా నిధులు విడుదల చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్