ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమితులయ్యారు. సాధారణ పరిపాలనా శాఖా పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఈ మేరకు జీవో నంబర్ 1034 విడుదల చేశారు.
1987 బ్యాచ్ కు చెందిన నీరభ్.. గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా పనిచేశారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
నిన్న చంద్రబాబుతో నీరభ్ భేటీ అయ్యారు. ఆ సమయంలో ఆయన నియామకానికి బాబు ఆమోద ముద్ర వేశారని తెలుస్తోంది. ప్రస్తుత సిఎస్ డా. కె. జవహర్ రెడ్డి నిన్న సెలవుపై వెళ్ళడంతో నూతన సిఎస్ నియామాకానికి మార్గం సుగమమైంది.
నీరభ్ కుమార్ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించేలా కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.