Friday, November 22, 2024
HomeTrending Newsఈవిఎం ల పనితీరుపై విపక్షాల రాద్దాంతం - ప్రధాని మోడీ

ఈవిఎం ల పనితీరుపై విపక్షాల రాద్దాంతం – ప్రధాని మోడీ

విపక్షాలు ఈవిఎమ్ మిషిన్ల పనితీరుపై అనేక సందేహాలు వ్యక్తం చేశారని, ఇప్పుడు వచ్చిన ఫలితాలపై ఏ జవాబు ఇస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించారు. ఈవిఎం ల పనితీరుపై విపక్షాలు అనవసర రాద్దాంతం చేసి ప్రజలను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేశాయని ఆరోపించారు.  వికసిత్ భారత్ లక్ష్యంగా రాబోయే కాలంలో పనిచేస్తామని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఎన్డీఏ కూట‌మి మ‌ధ్య బంధం బ‌లోపేతం కావ‌డానికి న‌మ్మ‌క‌మే కీల‌క‌మైంద‌ని నరేంద్రమోడి అన్నారు.

శుక్రవారం ఉదయం ఢిల్లీలోని పాత పార్లమెంట్‌ భవనంలో ఎన్డీయే కూటమి సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎన్డీయే కూటమి నేతలు మోడిని మూడోసారి ఎన్డీయే పక్షనేతగా ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మోడికి నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ ప‌క్ష నేత‌గా ఎన్నుకున్న త‌ర్వాత ప్ర‌సంగించిన మోడీ వివిధ అంశాల్ని ప్రస్తావించారు. ఎన్డీఏ నేత‌గా త‌న‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకోవ‌డం అదృష్ట‌వంతుడిగా భావిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోడీ అన్నారు. మీరంద‌రూ కొత్త బాధ్య‌త‌ను అప్ప‌గించార‌ని, దానికి కృత‌జ్ఞ‌తుడినై ఉంటాన‌న్నారు.

2019లో ఇదే స‌భ‌లో మాట్లాడుతున్న స‌మ‌యంలో.. అప్పుడు కూడా త‌న‌ను లీడ‌ర్‌గా ఎన్నుకున్నార‌ని, ఆ స‌మ‌యంలో న‌మ్మ‌కం ఎంత బ‌ల‌మైంద‌న్న విష‌యాన్ని చెప్పాన‌ని గుర్తు చేశారు. ఇప్పుడు మీరు అంద‌జేస్తున్న బాధ్య‌త కూడా ఆ బంధం నుంచి పుట్టింద‌న్నారు. మ‌న మ‌ధ్య ఉన్న విశ్వాస బంధం మరింత బ‌లోపేతంగా మారింద‌న్నారు. ఈ బంధం ఓ బ‌ల‌మైన పునాది మీద ఏర్ప‌డింద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ న‌రేంద్ర మోడీ విజ‌న్ ఉన్న నేత‌ని, ఆయ‌న విధానాలు, కార్యాచ‌ర‌ణ మెరుగైన ఫ‌లితాలు ఇస్తాయ‌ని ప్ర‌శంసించారు. ఈరోజు భార‌త్ మోడీ వంటి స‌రైన నాయ‌కుడి చేతిలో ఉంద‌ని, ఇది భార‌త్‌కు మంచి అవ‌కాశ‌మ‌న్నారు. ఈ అవ‌కాశాన్ని మ‌నం ఇప్పుడు కోల్పోతే మ‌రెప్ప‌టికీ ఇంత‌టి అవ‌కాశాన్ని అందుకోలేమ‌న్నారు. మోడీ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో అభివృద్ధిలో భార‌త్ స‌రికొత్త శిఖ‌రాల‌కు చేరుతుంద‌ని చంద్ర‌బాబు ఆకాంక్షించారు.

ఈ స‌మావేశంలో బిహార్ సీఎం, జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బిహార్‌లో పెండింగ్ ప‌నుల‌న్నీ పూర్తి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధాన మంత్రిగా మోడీ ఆదివారం ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నార‌ని, కానీ ఈరోజే ప్ర‌మాణ స్వీకారం చేయాల‌ని తాను కోరుకుంటున్నాన‌న్నారు. మీరు ఎప్పుడు ప్ర‌ధానిగా ప్ర‌మాణ స్వీకారం చేసినా తామంతా మీతోనే ఉంటామ‌ని, మీ నేతృత్వంలో తామంతా క‌లిసి ప‌నిచేస్తామ‌ని మోడీని ఉద్దేశించి నితీష్ కుమార్ పేర్కొన్నారు.

మోడీ మద్దతుతో ఏపీలో NDA కూటమి 91% స్థానాలు కైవసం చేసుకుందని పవన్ కళ్యాణ్ అన్నారు. మోడీ ప్రధానిగా ఉన్నంత కాలం ఈ దేశం ఎవరికీ తలవంచదు. మీ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. మీ పనులు, అభివృద్ధితో దేశంలోని ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించారని, స్ఫూర్తి నింపారన్నారు. మీ మద్దతుతోనే ఏపీలో భారీ మెజారిటీతో గెలిచామని పవన్ ప్రధానిని అభినందించారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్