దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ నగరంలో కార్మికులు నివాసముంటున్న భవనంలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 41 మంది మరణించారు. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:00 గంటలకు జరిగిందని సమాచారం. అగ్నిప్రమాదం సంభవించిన భవనం కార్మికులను ఉంచడానికి ఉపయోగించేది కాగా అక్కడ పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారు. దురదృష్టవశాత్తు మంటలతో వెలువడిన పొగ పీల్చడం ద్వారా చాలా మంది మరణించారని పోలీసు అధికారులు వెల్లడించారు. అప్పటికి అనేకమందిని పోలీసులు రక్షించారని సీనియర్ పోలీసు కమాండర్ చెప్పారు.
అగ్నిప్రమాదం కారణంగా 43 మంది ఆసుపత్రి పాలయ్యారని, వారిలో నలుగురు మరణించారని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పోలీసులు కథనం ప్రకారం 35 మరణాలకు అదనంగా నలుగురి మరణాలు ఉన్నాయా అనేది స్పష్టంగా తెలియలేదు.
మంటలను అదుపు చేశామని, దానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.
కార్మికులకు వసతి కల్పించే విషయంలో కువైట్ కంపనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గృహ వసతి పేరుతో కెపాసిటీకి మించి రూముల్లో కార్మికులను ఉంచుతున్నారని స్థానికులు అంటున్నారు. కార్మికులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తామని కువైట్ ప్రభుత్వ అధికారి నర్మగర్భంగా ఘటన కారణాలు వెల్లాడించారు.
చనిపోయిన వారు భారత్ లోని ఏ రాష్ట్రానికి చెందినవారు, ఏయే రంగాల్లో పనిచేస్తున్నారో తెలియాల్సి ఉంది.
-దేశవేని భాస్కర్