ప్రస్తుతం తెలుగుదేశం-బిజెపి-జనసేన పార్టీల హనీమూన్ నడుస్తోందని, వారికి కొంత సమయం ఇద్దామని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మన పార్టీ సంఖ్యా బలం దృష్ట్యా గొంతు నొక్కే అవకాశం ఉందని, అందుకే మండలిలో ఉధృతంగా పోరాటం చేదామని సూచించారు. పార్టీ ఓటమి అనంతరం నాయకులతో వరుస సమీక్షలు నిర్వహిస్తోన్న జగన్ నేడు పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను కలుసుకున్నారు. ఎమ్మెల్సీలు ఎవరూ ప్రలోభాలకు లొంగవద్దని, కేసులు పెట్టినా భయపడవద్దని, ఇప్పటికీ 40 శాతం ప్రజలు మనవైపే ఉన్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేద్దామని వారికి దిశా నిర్దేశం చేశారు.
మనం చేసిన మంచి పనులు ప్రజలకు గుర్తున్నాయని…. ప్రభుత్వానికి హామీల అమలుకు కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత ప్రజల తరఫున పోరాటం చేద్దామని హితబోధ చేశారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయని, ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్త చర్చ జరగాల్సి ఉందని జగన్ ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు.