పోలవరంపై చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని జలవనరుల శాఖా మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గత బాబు పాలనలోని చారిత్రక తప్పిదాలే పోలవరం సంక్షోభానికి కారణమని స్పష్టం చేశారు. కాఫర్ డ్యాముల మధ్య ఖాళీలు ఉంచడంతో వరద ఉధృతికి డయాఫ్రం వాల్ దెబ్బతిందని, స్పిల్ వే, రెండు కాఫర్ డ్యాంలు తమ ప్రభుత్వంలోనే పూర్తి చేశామని వెల్లడించారు. స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, క్రిటికల్ నిర్మాణాలు పూర్తిచేసి గేట్లన్నీ పెట్టామని, ఎంత వరద వచ్చినా ప్రాజెక్టును నిర్వహించే పరిస్థితికి తీసుకువచ్చామన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన తప్పులు ఒప్పుకొని ప్రాజెక్టును పూర్తి చేయడంపై చంద్రబాబు దృష్టి పెట్టాలని సూచించారు.
పోలవరం నిర్మాణం ఎన్నో సంక్లిష్ట సమస్యలతో కూడుకొని ఉందని, అంత తేలిగ్గా అర్ధం కాదని, తనకు అర్ధం కాలేదని…. పలుసార్లు ప్రాజెక్టును స్వయంగా పరిశీలించిన తరువాత, అధికారులతో మాట్లాడిన తరువాత ఈ ప్రాజెక్టు అంత త్వరగా పూర్తయ్యే అవకాశం లేదని ఎప్పుడో చెప్పానని, అదే విషయాన్ని బాబు ఇప్పుడు చెప్పారని అంబటి పేర్కొన్నారు.
చంద్రబాబుకు ఓ సువర్ణ అవకాశం వచ్చిందని, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం బాబు మద్దతుతోనే కొనసాగుతోందని, ఈ సమయంలో విభజన హామీల అమలు కోసం ఆయన డిమాండ్ చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు రావాలని రాంబాబు విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజూ జగన్ పై విమర్శలు చేస్తూ సమయాన్ని వృథా చేసుకోకుండా… పోలవరం, రైల్వే జోన్, ప్రత్యేక హోదా లాంటి అంశాల కోసం కృషి చేయాలని కోరారు.