Thursday, November 21, 2024
HomeTrending Newsరష్యాలో ఇస్లామిక్ ఉగ్రవాదుల ఘాతుకం

రష్యాలో ఇస్లామిక్ ఉగ్రవాదుల ఘాతుకం

రష్యాలో ఇస్లామిక్ తీవ్రవాదులు మారణహోమం సృష్టించారు. రష్యాలోని డాగేస్థాన్‌లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. రెండు చర్చిలు, యూదుల ప్రార్థనామందిరాలు, పోలీసు పోస్టుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో 15 మందికిపైగా చనిపోయారు. రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్ ముఫ్టియత్ అనే ఇస్లామిక్ సంస్థ ఈ దాడికి కుట్ర చేసిందని అనుమానిస్తున్నారు. ఇజ్రాయెల్ N12 వార్తా సంస్థ, జ్యూయిష్ కమ్యూనిటీ నివేదికల ప్రకారం ఈ దాడి ISIS నిర్వహించినట్లు భావిస్తున్నారు.

ఉగ్రదాడిలో పోలీసులతోపాటు పౌరులు చనిపోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మఖచ్‌కల, డెర్బెంట్‌ నగరాల్లోని చర్చిలు, ప్రార్థనామందిరాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ చేపట్టాయి. ప్రస్తుతానికి ఆపరేషన్‌ ముగిసినట్లు రష్యా జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రకటించింది. దీనిని ఉగ్రవాదుల చర్యగా ప్రకటించింది.

డాగేస్థాన్ చర్చిపై జరిగిన దాడిలో ఒక ఫాదర్‌తోపాటు ఆరుగురు మృతి చెందారని ఓ అధికారి వెల్లడించారు. చర్చిలో హత్యకు గురైన ఫాదర్‌ను 66 ఏండ్ల నికోలాయ్‌గా గుర్తించామన్నారు. చర్చికి రక్షణగా ఉన్న సెక్యూరిటీ గార్డును ముష్కరులు కాల్చి చంపారు. ఉగ్రవాద దాడి అనంతరం యూదుల ప్రార్థనా స్థలంలో మంటలు ఎగసిపడుతూ కనిపించాయి. డాగెస్థాన్‌లో జూన్‌ 24, 25, 26 తేదీల్లో సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

మరోవైపు ఉక్రెయిన్‌ డ్రోన్‌, క్షిపణుల దాడుల్లో ఆరుగురు మరణించినట్లు రష్యన్‌ అధికారులు ఆదివారం తెలిపారు. క్రిమియాలోని సేవాస్టోపోల్‌లో ఉక్రెయిన్‌ క్షిపణులను కూల్చేసినపుడు ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు బాలలు ఉన్నారని నగర గవర్నర్‌ మిఖాయిల్‌ చెప్పారు.

మూడు దఫాలుగా జరిగిన ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడుల్లో రష్యాలోని బెల్గోరోడ్‌ ప్రాంతంలో ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. రష్యాలోని బ్రియాన్‌స్క్‌, స్మోలెన్‌స్క్‌, లిపెట్‌స్క్‌, టులా ప్రాంతాల్లో 33 ఉక్రెయిన్‌ డ్రోన్లను కూల్చేసినట్లు రష్యన్‌ డిఫెన్స్‌ మినిస్ట్రీ ఆదివారం ప్రకటించింది.

పశ్చిమాసియాలో అమెరికా, నాటో దేశాలకు వ్యతిరేకంగా ముస్లిం దేశాలకు సహకరిస్తున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇజ్రాయల్ – హమాస్ యుద్దంలో హమాస్ వైపు, సిరియా, ఇరాన్ లతో అంటకాగుతున్న రష్యా తాజా దాడితో  విదేశాంగ విధానాన్ని సమీక్షించు కోవలసిన అగత్యం ఏర్పడింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్