ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపధ్యంలో అభినందించేందుకు వచ్చామని నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. సినిమా టిక్కెట్ల పెంపు అంశంపై మాట్లాడేందుకు పవన్ ను కలవలేదని స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ తో చర్చించామన్నారు. తెలుగు సినీ నిర్మాతలు నేడు విజయవాడ చేరుకొని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి, సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు. అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు.
ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పించాలని పవన్ ను కోరామని, అప్పుడు ఇండస్ట్రీ మొత్తం వచ్చి వినతి పత్రం ఇవ్వాలని అనుకుంటున్నామని వివరించారు. చిత్ర పరిశ్రమ తరఫున పవన్ కళ్యాణ్ కు సన్మానం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్వినీదత్ , ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణలు హైదరాబాద్ నుంచి వచ్చినవారిలో ఉన్నారు.
కాగా, పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’ లో హీరోయిన్ గా నటించిన యార్లగడ్డ సుప్రియ కూడా పవన్ ను కలుసుకున్న వారిలో ఉన్నారు. ఆయనతో ఆమె ప్రత్యేకంగా దిగిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.