కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో కీలక పార్టీగా ఉన్న జెడి(యు) పాత డిమాండ్ ను కొత్తగా తెరమీదకు తీసుకొచ్చింది. ఎప్పటి నుంచో ఉన్న బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ మొదలు పెట్టింది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) డిమాండ్ చేసింది. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రత్యేక హోదాను బీహార్‌కు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఆ మీటింగ్‌లో బీహార్ సీఎం నితీశ్ కుమార్ తీర్మానం చేశారు.
బీహార్ ఆర్థికంగా, అభివృద్ధిలో వెనుక ఉండటాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని, దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్‌ను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇదే సమావేశంలో జనతాదళ్ యునైటెడ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపీ సంజయ్ జాను నియమించారు.
బీహార్‌లో ఇటీవల 65 శాతానికి పెంచిన రిజర్వేషన్ కోటాను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ఈ తీర్మానంలో పేర్కొన్నారు. న్యాయపరమైన పరిశీలన, రక్షణ కోసం రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో రిజర్వేషన్ కోటాను చేర్చాలని జేడీయూ ప్రతిపాదించింది. అలాగే ఈ కోటాను నిరంతరాయంగా అమలు చేస్తామని జేడీయూ హామీ ఇచ్చింది.
జేడీయూ కీలక సమావేశం తర్వాత ఆ పార్టీ సీనియర్ నేత మీడియాతో మాట్లాడారు. బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్ కొత్తది కాదన్నారు. బీహార్ అభివృద్ధిని వేగవంతం చేయడం, రాష్ట్ర ప్రత్యేక సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమన్నారు. కోటా పెంపు అంశాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో పెట్టాలని జేడీయూ ప్రతిపాదించింది.
బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెనుక అసలు కథ వేరే ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ కోటాపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నితీష్ ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా డిమాండ్ ను తెర మీదకు తీసుకువస్తే కేంద్రం బేరసారాలకు దిగుతుందని… ఈ క్రమంలో బిసి కోటా అంశాన్ని పార్లమెంటులో కొలిక్కి తీసుకురావటం.. రాష్ట్రానికి అధిక నిధులు మంజూరు చేయించుకోవటం ముఖ్య లక్ష్యాలని అంటున్నారు.
ఎన్డీయేలో మరో భాగస్వామి టిడిపి కూడా ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్ ఎత్తుకుంటే కూటమిలో లుకలుకలు బయటకు వస్తాయి. దీంతో రెండు భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పరిచేందుకు బిజెపి నాయకత్వం తొందరలోనే ఉభయతారకమైన పరిష్కార మార్గాన్ని చూపే అవకాశం ఉందంటున్నారు.
-దేశవేని భాస్కర్