విద్యుత్ కొనుగోళ్ళ వ్యవహారంలో విపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో షాక్ తగిలింది. కేసీఆర్ రిట్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏజీ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్‌లో ఆక్షేపించారు. కెసిఆర్ తరఫు న్యాయవాదులతో విభేదించిన హైకోర్టు విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించొచ్చంటూ స్పష్టం చేసింది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం, థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం వీటిపిై విచారణకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ఈ పిటిషన్‌పై గత శుక్రవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌ల ధర్మాసనం.. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా, సోమవారం నాడు తీర్పును వెలువరించిన ధర్మాసనం.. కేసీఆర్ పిటిషన్‌ను కొట్టివేసింది. కేసీఆర్ తరఫున హాజరైన సీనియర్ లాయర్ ఆదిత్య సోంధి.. రాజకీయ కక్ష సాధింపుతోనే కమిషన్‌ను ఏర్పాటు చేశారని ఆరోపించారు.
-దేశవేని భాస్కర్