ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో గతవారం దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేసి నేటినుంచి అమలులో పెడుతున్నారు. 20 జిల్లాల్లోని 120 స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుకను అందిస్తారు. ప్రస్తుతం 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక పంపిణీకి సిద్ధంగా ఉందని, రాబోయే 3 నెలల్లో కోటి టన్నుల ఇసుకను అందించటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. సంవత్సరానికి షుమారు 3. 20 కోట్ల టన్నుల వరకూ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఆయా జిల్లాల్లోని ఇసుక రీచ్‌లలో ఎంత ఇసుక అందుబాటులో ఉందో కలెక్టర్లు సోమవారం నుంచి ప్రకటిస్తారు. ఎవరి పర్యవేక్షణలో ఇసుక అందజేయాలనేదానిపై కలెక్టర్లు జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ఏర్పాటు చేసి నిర్ణయిస్తారు.
ఇసుక డిపోకు వెళ్లి లారీ, ట్రాక్టర్, మినీ ఆటోల్లో తీసుకెళ్లొచ్చని, ఇసుక తవ్వినందుకు, లోడ్ చేసినందుకు, డిపోల వరకు తరలించినందుకు లేబర్, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. సగటున రోజుకు ఒక వినియోగదారుడికి 20 టన్నులే పంపిణీ చేస్తారు. ఇసుక రవాణా కోసం ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ సమర్పించాల్సి ఉంటుంది.
సీనరేజ్ కింద టన్నుకు కేవలం 88 రూపాయలను ప్రభుత్వం తీసుకోనుంది. ఇప్పటివరకు గుత్తేదారులు తవ్విన ఖర్చుల కింద టన్నుకు 30 రూపొయల చొప్పున వసూలు చేసే అవకాశం ఉంది. ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లో బోట్స్‌మెన్ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుక టన్నుకు రూ.225 చొప్పున వసూలు చేయనున్నారు. కాగా, రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలిస్తే.. రవాణా ఖర్చు కింద టన్నుకు కిలోమీటరుకు రూ. 4.90 చొప్పున అదనంగా వసూలు చేయబోతున్నారు. నిర్వహణ ఖర్చు కింద టన్నుకు 20 రూపాయలను తీసుకుంటారు. వీటన్నింటికీ కలిపి 18 శాతం జీఎస్టీ సైతం విధించనున్నారు. మొత్తంగా టన్ను ఇసుక ధర ఎంతనేదానిపై కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు.