Sunday, October 6, 2024
HomeTrending Newsఇక్కడి నుంచే కాంగ్రెస్ పునర్వైభవం: కడప ఉపఎన్నికపై రేవంత్

ఇక్కడి నుంచే కాంగ్రెస్ పునర్వైభవం: కడప ఉపఎన్నికపై రేవంత్

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం కడప నుంచే మొదలవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడప లోక్ సభకు ఉప ఎన్నిక వస్తుందంటూ ఇటీవల పేపర్లు, టివిల్లో చూస్తున్నానని, నిజంగా అదే జరిగితే ఊరూరా తిరిగి గెలుపు బాధ్యత తాను తీసుకుంటానని, కడప పౌరుషాన్ని ఢిల్లీకి చాటే సందర్భం వస్తే.. కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ జెండా మోయడానికి….గల్లీ గల్లీ తిరగడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఏ కడప జిల్లా ద్వారా కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి ఆ గద్దనుంచే పోరాటం మొదలు పెడదామని పిలుపు ఇచ్చారు. వైఎస్సార్ పేరుమీద రాజకీయ వ్యాపారం చేసేవారు ఆయన వారసులో, లేదా ఆయన ఆశయ సాధన కోసం పోరాడేవారు వారసులో ఆలోచించాలని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వైఎస్ఆర్ 75 వ జయంతి వేడుకల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ మంత్రులు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. గిడుగు రుద్రరాజు అధ్యక్షతన షర్మిల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, పల్లంరాజు, జేడీ శీలం తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు షర్మిల చేపట్టే ప్రతి కార్యక్రమానికీ తాము వెన్నుదన్నుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. నాడు వైఎస్ పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉంది పేదల తరఫున కోట్లాడి సిఎం అయ్యారని, అదే రీతిలో వైఎస్ షర్మిల 2029 ఎన్నికల్లో షర్మిల ఏపీ ముఖ్యమంత్రి, దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వెలిబుచ్చారు. తద్వారా వైఎస్ చివరి కోరిక నెరవేరుతుందన్నారు. కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదనీ, ఆశయాలు మోసినప్పుడే వస్తుందని, అలాంటి వారినే మనం గుర్తించాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కనీసం సర్పంచ్ కూడా గెలవడం సాధ్యం కాని పరిస్థితుల్లో ఇక్కడి నాయకత్వ బాధ్యతలు షర్మిల భుజానికెత్తుకున్నారని కొనియాడారు.

కడప లోక్ సభకు ఉప ఎన్నికలు జరుగుతాయని, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అసెంబ్లీకి రాజీనామా చేసి లోక్ సభ కు పోటీ చేస్తారని, దానికి అనుగుణంగా వైఎస్ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తారని కొంతకాలంగా వస్తున్న వార్తలకు రేవంత్ వ్యాఖ్యలు బలం చేకూర్చినట్లయ్యింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్