రాష్ట్రంలో వ్యవసాయానికి ఊతమిచ్చేలా బ్యాంకులు పనిచేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కౌలు రైతులకు సులభంగా రుణాలు అందే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. నేడు సచివాలయంలో సిఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యాలను, అమలు చేయనున్న పథకాలను వివరించిన చంద్రబాబు… దీనికి గాను బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరమని ప్సష్టం చేశారు. బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళికను విడుదల చేశారు. రూ.3,75,000 కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ.1,65,000 కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక విడుదల చేశారు. వ్యవసాయ రంగానికి రూ.2,64,000 కోట్లు రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. గతం కంటే 14 శాతం అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. డైరీ, ఫౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణకు, వ్యవసాయం రంగంలో మౌళిక సదుపాయాలకు రూ.32,600 కోట్లతో రుణ ప్రణాళిక రూపొందించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యతా రంగానికి రూ.3,23,000 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా…ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3,75,000 కోట్లు రుణ ప్రణాళికా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గతంతో పోల్చితే 16 శాతం అధికంగా రుణాల లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయ రంగానికి గత సంవత్సరం రూ.2,31,000 కోట్లు రుణ లక్ష్యంగా పెట్టుకోగా అందులో 90 శాతం అనగా రూ.2,08,136 కోట్ల రుణాలు మంజూరు జరిగిందని సమావేశంలో తెలిపారు. ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే MSME రంగానికి 2023-24 ఏడాదిలో రూ.69,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఈ ఏడాది ఏకంగా రూ.87,000 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అలాగే గృహ నిర్మాణానికి రూ.11,500 కోట్లు రుణాలు, సాంప్రదాయేతర ఇంధన సెక్టార్ కు రూ. 8,000 కోట్లు రుణాలు ఇవ్వనున్నారు.