Sunday, November 24, 2024
HomeTrending Newsవిద్యుత్ విచారణ కమిషన్ కు సుప్రీంకోర్టు చురక

విద్యుత్ విచారణ కమిషన్ కు సుప్రీంకోర్టు చురక

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రింకోర్ట్ లో షాక్ తగిలింది. విద్యుత్ కొనుగోళ్ళపై సర్వోన్నత న్యాయస్థానంలో కెసిఆర్ వేసిన పిటిషన్ పై కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ఎల్ నరసింహ రెడ్డిని మార్చాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పు పట్టిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఎవరిని నియమిస్తారో వెల్లడించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. వచ్చే సోమవారం కొత్త చైర్మన్ పేరును వెల్లడిస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.

కెసిఆర్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ డివై . చంద్రచూడ్ కమిషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని, తన అభిప్రాయాలు బహిరంగంగా ఎలా వ్యక్తం చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చురక అంటించింది.

బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు…యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని వచ్చిన ఆరోపణలపై.. రేవంత్ రెడ్డి సర్కార్ జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్ వేసి న్యాయ విచారణ జరిపిస్తోంది. విచారణకు హాజరుకావాలంటూ కేసీఆర్‌కు  కమిషన్ నోటీసులు జారీ చేసింది. నోటీసులపై స్పందించిన కెసిఆర్.. కమిషన్ విచారణ సరిగ్గా జరగట్లేదని.. కమిషన్ ఛైర్మన్ స్వచ్ఛందంగా వైదొలగాలంటూ లేఖ రాశారు కేసీఆర్.

కమిషన్ ఏర్పాటు నిబంధనలకు విర్ధుమని, దాన్ని రద్దు చేయాలని కెసిఆర్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌లో కేసీఆర్ చేసిన ఆరోపణలపై సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించలేదన్న కారణంతో ఆ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కెసిఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కేసీఆర్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారని, ట్రిబ్యునల్స్ ఉండగా, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ ఎలా వేస్తారని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు చేశామని వివరించారు.

మార్కెట్ రేట్ కంటే తక్కువగా, మేము యూనిట్ 3.90 రూపాయలకి మాత్రమే కొనుగోలు చేశామని వెల్లడించారు. పిటిషనర్ మాజీ ముఖ్యమంత్రని, ఇప్పుడున్న సీఎం ఈ అంశంపై అనేక సార్లు ఆర్.టి.ఐ దాఖలు చేశారు. ఇది కక్ష సాధింపు చర్య అన్నారు.

విచారణకు ముందే దోషిగా తేలుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ.ఆర్.సి ఉండగా, మళ్లీ విచారణ కమిషన్ అవసరం లేదని వాదించారు. అత్యవసర పరిస్థితుల్లో టెండర్లు లేకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వము నుంచే విద్యుత్ కొనుగోలు చేశామని, ప్రభుత్వ సంస్థల ద్వారానే భద్రాద్రి థర్మల్ కు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడామని పేర్కొన్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్