వైసీపీ పాలనలో జరిగిన సహజ వనరుల దోపిడీపై రెండ్రోజుల క్రితం శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే అంశంపై ఓ నివేదికను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు అందజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు గత రాత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. జగన్ హయాంలో అరాచకాలకు కూడా కేంద్ర హోంమంత్రి దృష్టకి తీసుకువెళ్ళారని తెలిసింది. దాదాపు గంటకుపైగా వీరిరువురి భేటీ జరిగింది.
గత ఐదేళ్ళ పాలనలో ఏపీలో ఆర్ధిక విధ్వంసం జరిగిందని, రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి, అప్పుల వివరాలపై ఇటీవలే ప్రజలకు వివరించామని, దీనితో పాటుగా నాలుగు అంశాలపై శ్వేత పత్రం విడుదల చేసి వాస్తవాలను వెల్లడించామని అమిత్ షా కు చంద్రబాబు తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో ఎన్డీయే కూటమిపై ఎన్నో ఆశలతో ప్రజలు అఖండమైన మెజార్టీతో తీర్పు ఇచ్చారని, హామీలను నెరవేర్చడంలో కేంద్రం తమ వంతు పాత్ర పోషించాలని ఆయన కోరారు. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో బాబు పోస్ట్ చేశారు.
ఈనెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అదేరోజు పార్లమెంట్ సమావేశాలు కూడా మొదలు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ కు ఎక్కువ నిధులు కేటాయించేలా చూడాలని పలువురు కేంద్ర మంత్రులను కూడా బాబు తాజా పర్యనలో కలిసి విజ్ఞప్తి చేయనున్నారు.
మరోవైపు, ఢిల్లీ లోని వన్ జనపథ్ ఇకపై చంద్రబాబు అధికారిక నివాసంగా ఉండనుంది. నేడు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించనున్నారు. ఇకపై ఢిల్లీ వచ్చినప్పుడు బాబు అక్కడే బస చేయనున్నారు.