Wednesday, November 27, 2024
HomeTrending Newsదుబాయ్ లో ఠారెత్తిస్తున్న ఎండలు...62 డిగ్రీల ఉష్ణోగ్రత

దుబాయ్ లో ఠారెత్తిస్తున్న ఎండలు…62 డిగ్రీల ఉష్ణోగ్రత

సూర్యతాపానికి దుబాయ్ ప్రజలు తీవ్రస్థాయిలో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎడారి దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు హడలెత్తిస్తున్నాయి. సందర్శకులతో కళకళ లాడే మార్కెట్లు, రోడ్లు, సముద్ర తీర ప్రాంతాలు బోసిపోయాయి. దుబాయ్ ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు.

జూలై 17న ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెలియస్‌కు చేరుకోగా.. రెండు రోజుల క్రితం అమాంతం పెరిగాయి. తాజాగా ఉష్ణోగ్రతలు 62 డిగ్రీ సెలియస్‌కు చేరుకున్నాయి. ఇది ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం తేమ, వేడి అధికంగా ఉంది. ఇది ప్రజలకు అత్యంత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు వార్నింగ్ ఇస్తున్నారు.

ప్రస్తుతం దుబాయ్‌లో ఉష్ణోగ్రత మనుషులు తట్టుకునే స్థాయి దాటిపోయిందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక తేమ, అధిక ఉష్ణోగ్రత కారణంగా మానవ మనుగడ ప్రమాదకర స్థాయికి చేరుతుందని అంటున్నారు. వెట్-బల్బ్ ఉష్ణోగ్రతలుగా చెప్పుకునే ఈ వాతావరణం శరీరంపై 6 గంటలకు మించి… 35 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. ఉంటే అది ప్రాణాంతకంగా మారుతుందని అంటున్నారు.

తాజా హీట్‌వేవ్ పరిస్థితులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని WHO హెచ్చరించింది. ఎండలో… బహిరంగ ప్రదేశాల్లో పనులు మానుకోవాలని సూచించింది. వేడి సంబంధ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.

దుబాయ్ లో ఆధునిక జీవనం పేరుతో వాహనాల వినియోగం అధికం. అన్ని ప్రాంతాల్లో ఏసిల వినియోగం సాధారణం. పరిమితికి మించి ప్లాస్టిక్ వినియోగం జరుగుతోంది. ఉష్ణ తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు ఏసీలను అధికంగా వినియోగిస్తున్నారు. దాంతో విద్యుత్ వినియోగం పెరగటంతో పాటు వాతావరణ కాలుష్యం తీవ్రమవుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏసి వినియోగం ద్వారా క్లోరోఫ్లోరో కార్బన్‌లు (CFCలు), హైడ్రోఫ్లోరో కార్బన్‌లు (HFCలు) ఓజోన్ పోరకు నష్టం కలిగించే కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. ACలు పనిచేయడానికి అధిక మొత్తంలో శక్తి తీసుకుంటాయి. శక్తి శిలాజ ఇంధనాల ద్వారా వస్తుంది. ఇది ఓజోన్ క్షీణతకు మరింత దోహదం చేస్తుంది.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన వర్షాలకు దుబాయ్ లో జనజీవనం స్తంభించింది. 75 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో పడిన భారీ వర్షంతో దుబాయ్‌లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రపంచంలో రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఎయిర్పోర్ట్ వరదల్లో చిక్కుకుంది. ఎడారి ప్రాంతమైన దుబాయ్‌లో సగటు వార్షిక వర్షపాతం 100 మిల్లీమీటర్లు కాగా.. ఒక్కరోజులోనే 120 మిల్లీమీటర్ల వర్షం ముంచెత్తింది.

అరేబియా ద్వీపకల్పంలో భాగమైన యూఏఈలో వర్షం పడటం అరుదు. శీతాకాలంలో అడపాదడపా వర్షాలు పడుతుంటాయి. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నా ఈసారి చరిత్రలో ఎన్నడు లేని విధంగా 62 డిగ్రీలకు చేరటం ప్రజలను, పాలకులను కలవరపరుస్తోంది. వేసవి తాపం అక్టోబర్ వరకు కొనసాగనుందని ఆ దేశ వాతావరణ శాఖ ప్రకటించింది.

వేసవిలో నిప్పుల కొలిమిగా మారుతున్న దుబాయ్ కి వెళ్లాలనుకునే పర్యాటకులు వెళ్లకపోవటం మంచిదని… తప్పనిసరి వెళ్ళాల్సిన వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవలిసిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్